విశాఖకు తరలి వస్తున్నాయే?

జగన్ సర్కార్ విశాఖను రాజధానిగా నిర్ణయించింది. అయితే దానికి కొన్ని అడ్డంకులు అవరోధాలు ఉన్నాయి. కోర్టులో మూడు రాజధానుల వివాదం ఉంది. దాని మీద విచారణ పూర్తి [more]

Update: 2021-06-28 08:00 GMT

జగన్ సర్కార్ విశాఖను రాజధానిగా నిర్ణయించింది. అయితే దానికి కొన్ని అడ్డంకులు అవరోధాలు ఉన్నాయి. కోర్టులో మూడు రాజధానుల వివాదం ఉంది. దాని మీద విచారణ పూర్తి అయి తీర్పు రావాలి. అయితే ఈ లోగా కొన్ని కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయని తెలుస్తోంది. అందులో ముందుగా వచ్చేది అధికార భాషా సంఘం ప్రధాన కార్యాలయం అని తెలుస్తోంది. దీని మీద కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది అంటున్నారు. అధికార భాషా సంఘం ప్రెసిడెంట్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో స్థిరపడిన వారే కావడంతో ఆయన సై అంటున్నారు.

శుభారంభమే…?

విశాఖలో అధికార భాషా సంఘం ఆఫీస్ వస్తే కొన్ని కార్యకలాపాలు మొదలవుతాయి అంటున్నారు. విశాఖలోనే ప్రతిష్టాత్మకమైన అంధ్రా యూనివర్శిటీ ఉంది. మేధావులు, భాషా కోవిదులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మరో వైపు కైలాసగిరి మీద తెలుగు మ్యూజియంని కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో విశాఖలో తెలుగు వెలుగులు నలు దిక్కులా ప్రసరింపచేయలన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉందిట. దీంతో పాటే మిగిలిన ఆఫీసులూ వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు అంటున్నారు.

మాస్టర్ ప్లాన్ ….

విశాఖ సిటీ అభివృద్ధి కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందులో బీచ్ రోడ్డు అభివృద్ధి ముఖ్యాంశంగా ఉంది. ఒకటి రెండూ కాదు తొమ్మిది బీచ్ లను అభివృద్ధి చేయాలన్నది తమ అజెండాగా వైసీపీ సర్కార్ చెబుతోంది. ఇక భోగాపురం నుంచి విశాఖ వరకూ ఉన్న రోడ్డుని ఆరు లైన్లుగా మార్చితే కనుక ట్రాఫిక్ పెరిగి విశాఖకు రాజధాని కళ ఇట్టే వచ్చేస్తుంది. జగన్ ఎటూ విశాఖ నుంచి పాలన సాగిస్తారు అని చెబుతున్న వేళ ఆయనతో పాటు రావాల్సిన ఆఫీసుల జాబితా కూడా రెడీ అవుతోంది. మొత్తానికి అటు ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మొదలవుతున్నాయి.

ఎవరూ ఆపలేరా …?

జగన్ విశాఖ నుంచి పాలిస్తారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధరావు చెబుతున్నారు. ముఖ్యామంత్రి ఎక్కడ నుంచి అయినా పాలించవచ్చునని ఆయన అంటున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విశాఖ నుంచి జగన్ పాలన స్టార్ట్ అవుతుందని కూడా గుడివాడ కొత్త విషయం చెప్పారు. జగన్ ని విశాఖ నుంచి పాలించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు అని కూడా ఆయన అంటున్నారు. విశాఖకు పాలనా రాజధానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండడమే కాదు, మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. మొత్తానికి జగన్ రాకకు సూచిక అన్నట్లుగా విశాఖలో ప్రగతి రధం పరుగులు తీయనుంది. ఇప్పటిదాకా చూసిన విశాఖ కాదు నవ్య విశాఖను చూస్తామని మంత్రులు అంటున్నారు అంటే జనాలు కలలు కనాల్సిందేగా మరి.

Tags:    

Similar News