ఇక్కడా ఇన్ సైడర్ ట్రేడింగేనా?

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక నిర్ణయాలను తిరగతోడుతున్నారు. అందులో భాగంగా అమరావతి రాజధాని, పోలవరం నుంచి ప్రతీ విషయంలోనూ కొత్త సర్కార్ ముద్ర ఉండేలా [more]

Update: 2019-09-11 02:00 GMT

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక నిర్ణయాలను తిరగతోడుతున్నారు. అందులో భాగంగా అమరావతి రాజధాని, పోలవరం నుంచి ప్రతీ విషయంలోనూ కొత్త సర్కార్ ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఓ వైపు అభివృధ్ధిని చేస్తూనే మరో వైపు గత సర్కార్ లో హవా చలాయించిన పెద్ద తలకాయల గుత్తాధిపత్యం బద్దలు కొట్టడానికే వైసీపీ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో విజయనగరం కొత్తవలసలో టీడీపీ సర్కార్ ప్రతిపాదించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరుకు జగన్ సర్కార్ తరలిస్తోంది. సాలూరు పట్టణానికి సుమారు 20కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత పాచిపెంటలో గిరిజన వర్శిటీని నెలకొల్పేందుకు వైసీపీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. దాంతో టీడీపీ తమ్ముళ్లకు గట్టి ఝలక్ తగిలినట్లైంది. మరో వైపు జిల్లా సమగ్రాభివృధ్ధికి సాలూరులో వర్శిటీ ఏర్పాటు కరెక్ట్ అని కూడా వైసీపీ సర్కార్ భావిస్తోంది.

రియల్ వ్యాపారం కోసమే….

విశాఖపట్నానికి, విజయనగరానికి మధ్యలో కొత్తవలస ఉంది. అక్కడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. విశాఖ నగరంలో ఎక్కడా చోటు లేకపోవడంతో కొత్తవలస మీద అంతా పడుతున్నారు. తమ్ముళ్ల రియల్ బిజినెస్ తో పాటు, అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ కూడా తమ్ముళ్ళకు న్యాయం చేసేందుకు కొత్తవలసలో గిరిజన‌ వర్శిటీకి పచ్చజెండా వూపారు, నిజానికి వర్శిటీ పాడేరులో పెట్టాలని మొదట అనుకున్నా కేవలం రియల్ వ్యాపారం కోసమే ఇలా ప్రతిపాదించారని అప్పట్లోనే ప్రచారం సాగింది. వర్శిటీ సమీపంలో ఉంటే తమ్ముళ్ళ భూములకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చిపడుతుందని భావించే ఇలా చేశారని అంటారు, ఇక విజయనగరానికె చెందిన అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా సాలూరులో పెట్టమని కోరినా కూడా గంటాదే పైచేయిగా నిలిచింది. ఇపుడు వైసీపీ సర్కార్ కొత్తవలసను మార్చేసి సాలూరుకు వర్శిటీని తేవాలనుకోవడంతో మాజీ మంత్రితో పాటు, తమ్ముళ్ళకు కూడా రియల్ బూమ్ కల చెదిరిపోయినట్లైందని అంటున్నారు.

రాజన్నదొర పట్టు….

సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర కూడా సాలూరులో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేయాలని అప్పట్లోనే కోరారు. అయితే అధికార టీడీపీ మాత్రం పెడచెవిన పెట్టింది. పైగా ప్రభుత్వ భూములు పెద్దగా లేని చోట కొత్త వలసలో ఏర్పాటుకే మొగ్గు చూపడం వెనక కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రచారం ఉంది. వాటికి జగన్ సర్కార్ చెక్ పెడుతూ సాలూర్లో వర్శిటీని ఏర్పాటుకు రంగం సిధ్ధం చేశారు. దీనివల్ల సాలూరు ప్రాంతం కూడా పూర్తిగా అభివ్రుధ్ధి చెందుతుందని అంటున్నారు.

నిర్ణయానికి మద్దతు…

ఇక్కడ వేలాది ఎకరాల మాన్సస్ భూములు కూడా ఉన్నాయి. వాటిని వర్శిటీ కోసం ఉచితంగా ఇచ్చేందుకు కూడా మాన్సాస్ ముందుకువచ్చింది. అయినా నాటి టిడిపీ సర్కార్ పెడచెవిన పెట్టి కొత్తవలస వైపే మొగ్గు చూపింది. ఇపుడు జగన్ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అలాగే బాగా వెనకబడిన జిల్లాగా ఉన్న విజయనగరానికి కూడా న్యాయం జరుగుతుందని కూడా చెబుతున్నారు. కొత్తవలస వంటి అభివృధ్ధి చెందిన చోటనే మరింత అభివృధ్ధిని చేయాలనుకోవడం తగదన్న వైసీపీ విధానానికి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో రియల్ వ్యాపారులకు కూడ చెక్ చెప్పినట్లైందని అంటున్నారు.

Tags:    

Similar News