రగులుకుంటోందా?

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన హస్తం పార్టీలో అలకలు, అసంతృప్తులు, అంతర్గత కలహాలు అత్యంత సహజం. పదవుల కోసం పైరవీలు, పోరాటాలు షరా మామూలే. ఢిల్లీ అధినాయకత్వమే [more]

Update: 2020-02-01 17:30 GMT

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన హస్తం పార్టీలో అలకలు, అసంతృప్తులు, అంతర్గత కలహాలు అత్యంత సహజం. పదవుల కోసం పైరవీలు, పోరాటాలు షరా మామూలే. ఢిల్లీ అధినాయకత్వమే పరోక్షంగా వీటిని ప్రోత్సహిస్తుందన్న వాదన లేకపోలేదు. పార్టీ రాష్ట్ర శాఖలు సమైక్యంగా ఒకే మాట మీద ఉంటే ఎక్కడ తమ మాట వినరేమోరన్న భయం, తమ ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనతో అధిష్టానమే వీటిని ప్రోత్సహిస్తుందన్న ప్రచారాన్ని అంత సులువుగా తోసిపుచ్చడం కష్టమే. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఒకింత ఎక్కువగా ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య ఉద్దేశ్యపూర్వకంగానే విభేదాలను అధినాయకత్వం సృష్టిస్తుందన్న విమర్శల్లో వాస్తవం లేకపోలేదు.

అంతర్గత కలహాలతో……

ప్రస్తుతం రెండు పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో పార్టీ శ్రేణులు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు చత్తీస్ ఘడ్, పంజాబ్, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జార్ఖండ్, మహారాష్ట్రలలో సంకీర్ణ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామి. పుదుచ్చేరి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఎదురు లేదు. పంజాబ్ లో భారీ మెజారిటీ సాధించిన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దే హవా. ఛత్తీస్ ఘడ్ లో అత్యధిక స్థానాలను గెలుచుకున్న సీఎం భూపేష్ బఘల్ కు కడా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల్లోనే పార్టీ అంతర్గత కలహాలను ఎదుర్కొంటోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ సీనియర్లు అయిన ముఖ్యమంత్రులు, యువనేతల మధ్య పోరు నడుస్తోంది.

పదిహేనేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చినా…..

దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లో పదిహేనేళ్ల తర్వాత 2018లో హస్తం అధికారం సాధించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నాయకుడు కమల్ నాథ్ సీఎం అయ్యారు. పార్టీ గెలుపులో యువనాయకుడైన, రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా పాత్ర కూడా తక్కువేమీ కాదు. తొలుత తనను సీఎం చేస్తారని జ్యోతిరాదిత్య సింధియా ఆశించారు. అది దక్కకపోవడంతో కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఎంతగానో ఊహించుకున్నారు. ఈ రెెండింటిని పక్కన పెడితే కనీసం హోం, ఆర్థిక, రెవెన్యూ వంటి కీలప శాఖలు కట్టబెడతారని భావించారు. కనీసం పీసీసీ చీఫ్ పదవి కూడా దక్కలేదు. దీంతో జ్యోతిరాదిత్య సింధియా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తనకు సీఎం లేదా ఇతర పదవులు దక్కి ఉండాల్సిందని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. ఇప్పుడు పీసీపీ చీఫ్ పదవిని సీఎం కమల్ నాధ్ వదులుకుంటారని, ఆ పదవిలో జ్యోతిరాదిత్య ను కూర్చోబెడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ వంట ిసీనియర్లు కన్నేసినప్పటికీ సింధియా వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం….

అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న మరో రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సహజంగానే సీనియర్ అయిన గెహ్లాట్ యువనాయకుడైన సచిన్ పైలట్ ల మధ్య వయసు పరంగా, విధానాల పరంగా అంతరం ఉంది. పర్జల మద్దతు తనకు ఉండబట్టే 2018లో రాహుల్ గాంధీ తనకు సీఎం పీఠం అప్పగించారని అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా అనంతరం ఒక దశలో తన పేరును కూడా పరిశీలించారని ఆయన తన అంతరింగుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కోట నగరంలో చిన్న పిల్లల మరణాలపై ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేక పోయిందని పీసీపీ అధ్యక్షుడు కూడా అయిన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బహిరంగంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కల్లోలం రేపాయి. సచిన్ విమర్శలపై సీఎం గెహ్లాట్ గుర్రుగా ఉన్నారు. 200 స్థానాల గల అసెంబ్లీలో కాంగ్రెస్ వంద స్థానాలను మాత్రమే గెలిచింది. 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల మద్దతుతో సర్కార్ నడుస్తోంది. విపక్ష బీజేపీకి 73 మంది ఎమ్మెల్యేలున్నారు. సంఖ్యాపరంగా ప్రస్తుతానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు అనివార్యమవుతాయి. ప్రస్తుతం ఢిల్లీ నాయకత్వం వేచి చూసే ధోరణిలోనే ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News