ముమ్మరంగా గాలింపు చర్యలు

Update: 2018-05-16 09:53 GMT

గోదావరి నదిలో బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తొంది. సుమారు 40 అడుగుల లోతులో ఉన్న పడవను అతికష్టం మీద బయటకు తీశారు. పోలవరం నుంచి భారీ క్రేన్ ను తీసుకువచ్చి బోటు ను ఒడ్డుకు తీసుకువచ్చారు. నీటిలో తేలిన పలు మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు. బోటులో కూడా కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మొత్తం ఎంత మంది గల్లంతయ్యారన్నది తెలియరావడం లేదు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం జరిపించి బందువులకు అప్పగిస్తున్నారు. మృతుల బంధువుల అర్తనాదాలతో పూర్తిగా విషాద వాతావరణం నెలకొంది. మృతుల్లో రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉండటం ప్రతీఒక్కరిని కంటతడి పెట్టించింది.

ఘటనా స్థలిని సందర్శించిన ముఖ్యమంత్రి....

పడవ ప్రమాదం జరిగిన స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును, గాలింపు చర్యలను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, ఎటువంటి సహాయం అందించేందుకైనా అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని సూచించారు. అనంతరం ఆయన హెలికాఫ్టర్ లో పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Similar News