Chandrababu : బాబు మారడు.. జనం దరిచేరరు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు కీలకం. ఆయన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అన్ని దారులు వెతుకుతారు. అయితే ఆయనను నమ్మేదెలా? ప్రజలు [more]

Update: 2021-11-01 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు కీలకం. ఆయన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అన్ని దారులు వెతుకుతారు. అయితే ఆయనను నమ్మేదెలా? ప్రజలు ఆయనను విశ్వసిస్తారా? మరోసారి పట్టం కడతారా? అసలు జగన్ కు ప్రత్యామ్నాయంగా చంద్రబాబును ప్రజలు భావిస్తున్నారా? అంటే అన్నీ అనుమానాలే. పోలింగ్ రోజు వరకూ నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు స్వయంకృతమే పార్టీకి ఈ పరిస్థితిని తెచ్చిపెట్టింది.

2014 ముందు వరకూ….

చంద్రబాబు సమర్థవంతమైన నేతగా ప్రజల్లో బలమైన ముద్ర వేసుకోగలిగారు. గ్లామర్ లేకపోయినా, ప్రసంగాల్లో పస లేకపోయినా ఆయన పనితీరు మాత్రమే మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసింది. అయితే అది 2014 ఎన్నికలకు ముందు వరకూ మాత్రమే. 2014 లో అధికారంలోకి వచ్చి చంద్రబాబు చేసిన ఐదేళ్ల పరిపాలన ఆయనపై ఉన్న నమ్మకాలన్నీ వమ్ము అయ్యాయి. ఏ హామీని నిలబెట్టుకోకుండా జనం దృష్టిలో అపనమ్మకాన్ని మిగిల్చారు.

అతి విశ్వాసంతో….

తాను తప్ప ఏపీకి ప్రత్యామ్నాయం లేదన్న అతి విశ్వాసమే చంద్రబాబు కొంపముంచింది. సాధ్యం కాని పనులను నెత్తికెత్తుకున్నారు. సింగపూర్ తరహా రాజధాని అంటూ గ్రాఫిక్స్ తో మభ్యపెట్టారు. పోలవరం పరిస్థితి కూడా అంతే. ఇక తన సామాజికవర్గం వారికే ఎక్కువ ఉపయోగపడేలా నిర్ణయాలు ఉన్నాయన్న వైసీపీ విమర్శలను జనం బాగా నమ్మారు. దీంతో చంద్రబాబు తానే ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రి అనుకున్నా, ప్రజలు మాత్రం గత ఎన్నికలలో వాత పెట్టారు.

గతం కంటే భిన్నంగా….

ఇక రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు పరిస్థితి ఇంతకంటే మిన్నగా ఉంటుందని చెప్పలేం. ఆయనను జనం నమ్మే పరిస్థిితి లేదు. పోనీ జగన్ పై వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అయినా నమ్ముతారా? అంటే అది కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు వస్తే తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడుతుందన్న భావన వారిలో ఉంది. బాబు వస్తే తిరిగి ఆర్టీసీని ప్రయివేటీకరిస్తారన్నది ఆ ఉద్యోగుల భావన. సో .. ఎటు చూసినా చంద్రబాబు పరిస్థితి గత ఎన్నికల కంటే భిన్నంగా మాత్రం ఉండబోదు.

Tags:    

Similar News