హడలెత్తిస్తున్న ముంబయి గ్యాంగ్

Update: 2018-03-16 02:15 GMT

స్కెచ్ వేసేది ఒకరు అమలు చేసేది. మరొకరు... దోపిడి చేస్తున్నామని తమ ముఠాలోని అందరికీ చెప్పరు. కేవలం ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. దోపిడికి పదిమందిని తీసుకుని వస్తారు. దోచుకునే ది మాత్రం ఇద్దరే. హైదరబాద్ నగరంలో రెచ్చిపొతున్న ముంబయ్ గ్యాంగ్ కొత్త తీరు లో దోపిడీలు చేస్తున్నాయి. పాతబస్తీలో బంగారు ఆభరణాలు దోపిడి చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టినా.... వారిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఒకరికి మరొకరికి లింక్ లేకపోవడం వల్లనే పోలీసులు పట్టుకోలేకపోతున్నారు.

ముందుగానే రెక్కీ చేసి.....

ముంబాయ్ బ్యాచ్ మళ్లీ హైదరాబాద్ లో రెచ్చి పొయింది. క్షణాల్లో దోపిడీ లు చేసి తప్పించుకోవడం ఈ ముఠా పని,.. వచ్చిన పని పూర్తి అయ్యేవరకు ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించరు. తమ టార్గెట్ పూర్తయిన తర్వాత ఎక్కడ కలవాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. పక్కా ప్లాన్ తో దోపిడీ చేసి తప్పించుకుంటారు. కార్పొరేట్ ఉద్యోగుల మాదిరిగా దోపిడీలకు వస్తారు. దోపిడీ చేసే దగ్గర నుంచి పారిపోయేంత వరకూ ముందుగానే రెక్కీ చేసుకుంటారు. ఎలా తప్పించుకోవాలన్నది ముందుగానే ఈ ముఠా వర్క్ అవుట్ చేసుంది. ఇప్పుడు హైదరాబాద్ ను ముంబయి గ్యాంగ్ హడలెత్తిస్తుంది.

గంట తర్వాత తెలిసింది....

ఈ నెల3వ తేదీన పాతబస్తీ లోని బంగారు నగల కార్ఖానాలో భారీ దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. పది మంది వచ్చి పట్టపగలే మూడున్నర కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. కేవలం పది నిమిషాల్లోనే పనికానిచ్చారు. ఈ దోపిడీ జరిగిన విషయం బయటకు వచ్చేసరికి గంటకు పైగానే పట్టింది. తొలుత ఇంటిదొంగల పనేనని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఠా పని అని భావించిన పోలీసులకు విచారణలో ముంబయి గ్యాంగ్ పని అని తేలింది.

అమ్జా కరడుగట్టిన నేరగాడు....

ముంబయిలో కరడు గట్టిన నేరగాడు అమ్జీద్ షేక్ అలియాస్ అమ్జా గ్యాంగ్ ఈ దోపిడీ చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ముఠాపై ఇప్పటికే నలభైకి పైగా దోపిడీకేసులున్నాయి. ప్రధానంగా ఈ గ్యాంగ్ బంగారు నగల దుకాణాలనే టార్గెట్ చేస్తుంది. ప్రతి దోపిడీకి కొత్తవారిని పంపించడం ఈ ముఠా ప్రత్యేకత అంటున్నారు పోలీసులు. ఈ గ్యాంగ్ ముంబయి, అహ‍్మదాబాద్, సూరత్ లలో ఇప్పటికి నలభై దోపిడీలు చేసింది. ఎట్టకేలకు పోలీసులు గ్యాంగ్ లీడర్ అమ్జాను పట్టుకోగలిగారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకోగానే అమ్జా కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. తనకు ఈ గ్యాంగ్ గురించి తెలియదని, తాను ప్లాన్ మాత్రమే చెబుతానని పోలీసులకు చెప్పారు. అమ్జా దొరికాడు కాని మిగిలిన తొమ్మిది మంది కోసం పోలీసుల వేట కొనసాగుతుంది.

Similar News