సుప్రీం మాట లెక్క చేయలే.. కానీ, ఖాజీపేట కోర్టుకెళ్లారు...!

Update: 2016-12-05 10:12 GMT

ఎంత దిగ్గజాలు అయినా ఎక్కడో ఒకచోట తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక చోట హవా నడిపించిన వారే.. మరో చోట దయనీయ స్థితిలో ఉండవచ్చు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి కూడా అలాంటి విచిత్రమైన పరిస్థితే ఎదురైంది. ఒకవైపు ‘కనీసం మా ఉత్తర్వులకు సమాధానం చెప్పు బాబూ చాలు’ అంటూ సుప్రీం కోర్టు ఆదేశించినా కూడా.. ఖాతరు చేయకుండా ఉండిపోయిన, పట్టించుకోకుండా ఉండిన మధుసూదనాచారి ఖాజీపేట రైల్వే కోర్టుకు మాత్రమే స్వయంగా హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట హాజరై కేసు వాయిదా పడగా, ఈసురోమంటూ తిరిగి వచ్చారు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్ రోకో లకు సంబంధించి ప్రస్తుతం తెరాస ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ప్రముఖులపై అప్పట్లో కేసులు నమోదు అయ్యాయి. రైల్ రోకోలను విచారించే రైల్వే చట్టం చాలా పదునైనది కావడంతో.. రైల్వే కోర్టుల విచారణల విషయంలో నేతలు అలసత్వం ప్రదర్శించరు. ఆ క్రమంలో ఇటీవలే సికింద్రాబాద్ రైల్వే కోర్టులో కేటీఆర్, కోదండరాం, దత్తాత్రేయ తదితరుల మీద కేసుల్ని కొట్టేసిన సంగతి పాఠకులకు గుర్తంటుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ స్పీకరుగా ఉన్న మధుసూదనాచారి మీద ఖాజీపేట రైల్వే కోర్టులో కేసు ఉంది. ఈకేసు విచారణకు ఆయన స్వయంగా హాజరు కావాల్సి వచ్చింది. స్పీకరుగా ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన, హైకోర్టు న్యాయమూర్తికి సమానమైన అధికారాలతో ఉన్నప్పటికీ.. రైల్వే కేసు పాత చరిత్రకు సంబంధించింది కావడం మూలాన.. ఆయన స్వయంగా వెళ్లారు.

అయితే అదే స్పీకరు మధుసూదనాచారి కొన్ని వారాల కిందటే సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఉండిపోయిన వైనం మనకు గుర్తుండాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద చర్య తీసుకోవడానికి మీకు ఎంత సమయం కావాలో చెప్పండి అంటూ సుప్రీం ఆదేశిస్తే.. అసలు స్పీకరు పనితీరులో జోక్యం చేసుకునే హక్కు సుప్రీం న్యాయస్థానానికి లేదంటూ.. ఆయన న్యాయవాదితో చెప్పించి సంచలనం సృష్టించారు. అప్పుడంత ధీమాగా ఉన్నప్పటికీ.. ఖాజీపేట రైల్వే కోర్టుకు స్వయంగా వెళ్లారు. అదే మరి చిత్రం.

Similar News