టీడీపీపై బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి ఫైరయ్యారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ఏం బాకీ ఉందో చెప్పాలని చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశారు. కేంద్రం ఏపీకి చేయాల్సిందంతా చేసేసిందని చెప్పారు. మిత్రపక్షంగా ఉంటూ తమపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని సోము వీర్రాజు కోరారు. వెనుకబడిన ఏడు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇచ్చిందన్నారు. అయితే ఆ వెనుకబడిన జిల్లాల్లో ఎన్ని పరిశ్రమలు పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు. విభజన బిల్లు అమలు గడవు 2022 వరకూ ఉందన్న విషయాన్ని మరిచిపోయి నాలుగేళ్లలోనే ఉద్యమాన్ని నడుపుతారా? అని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం రాజధానిలో నాలుగు నిర్మాణాలకు మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని, రాజధాని నిర్మాణంకోసం కేంద్రం ఇచ్చిన 1600 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. నిధులను తేవడంలో తానే నెంబర్ వన్ అని నిన్నటి వరకూ చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. రాజీనామాల విషయంలో టీడీపీ, వైసీపీలు డ్రామాలాడుతున్నాయన్నారు. ఎవరో కొన్ని సంఘాలు పెట్టినంత మాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేదీ లేదని అన్నారు. ఎన్నికల ప్రణాళికను టీడీపీ ఏ మేరకు అమలు చేసిందో తానే పవన్ కల్యాణ్ ను అడుగుతానని చెప్పారు.