శేఖర్‌రెడ్డిపై ఐటీదాడుల వెనుక పన్నీర్ సెల్వం!?

Update: 2016-12-08 22:20 GMT

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి అంటే చాలా ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లు దానిని అపూర్వమైన పవిత్రమైన హోదాగా భావిస్తారు. ఆ పదవి దక్కడం అదృష్టంగా , భగవదనుగ్రహంగా తలపోస్తారు. అలాంటి పాలకమండలి సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి అనే కాంట్రాక్టరుపై ఐటీ శాఖ శుక్రవారం దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నయ్, వేలూరు, కాట్పాడిల్లో ఆయన ఇళ్లు, ఆఫీసులపై దాడులుచేసిన అధికారులే నివ్వెరపోయేలా.. భారీ మొత్తాలు దొరకడం జరిగింది. వాటిలో 70కోట్ల కొత్తనోట్ల నగదు ఉండడం ఇంకా ట్విస్టు.

అయితే శేఖర్ రెడ్డి మీద ఐటీ దాడులు అంత ఆషామాషీగా ఏమీ జరగలేదనే వాదన ఒకటి తమిళ రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. శేఖర్ రెడ్డి అన్నా డీఎంకే పార్టీ నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే జయలలితకు అనగా ఇండైరక్టుగా శశికళకు కూడా బాగా కావాల్సిన వ్యక్తి. అలాంటి నేపథ్యంలో.. శేఖర్ రెడ్డి మీద ఐటీ దాడుల వెనుక ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ధాడులు అన్నా డీఎంకేలో వర్గాల పోరుకు నిదర్శనం అనే వాదన కూడా వినిపిస్తోంది. శశికళ వర్గం మీద దెబ్బతీయడానికి సీఎం పన్నీర్ సెల్వం తెర వెనుక ఉండి.. ఐటీ దాడులు చేయించారని పలువురు అనుకుంటున్నారు.

అదే గనుక నిజమైతే.. చాలా పురాతనమైన యుద్ధనీతిని పన్నీర్ సెల్వం పాటిస్తున్నట్లు లెక్క. ‘శత్రువును గెలవాలంటే.. ముందు వారి బలాలను నాశనం చేయాలి’ అనేది యుద్ధనీతి. శశికళ మీద పైచేయి సాధించడానికి పన్నీర్ సెల్వం ముందుగా ఆమెకు ఉండగల ఆర్థిక వనరులను దెబ్బతీస్తున్నారని అంచనాలు సాగుతున్నాయి. ఆమె కోటరీలో కీలకమైన వ్యక్తులను దెబ్బ కొడితే... తర్వాత ఆమెను రాజకీయంగా దెబ్బకొట్టడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో పన్నీర్ సెల్వం ఇలా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి నిజానిజాలేమిటో నిలకడ మీద గానీ తెలియవు.

Similar News