శుభవార్త : పోలవరం కూడా జోరందుకుంటుంది

Update: 2016-12-10 06:30 GMT

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రస్తుతం రెండు అంశాల మీద విపరీతంగా తమ దృష్టి పెడుతున్నది. అవి 1. పోలవరం 2. అమరావతి. ఈ రెండు పనుల్లో ప్రతి వారం సమీక్షలు జరుపుతూ.. చంద్రబాబునాయుడు తన సమయాన్ని అధికంగా కేటాయిస్తున్నారు. వచ్చే ఎన్నికలలోగా ఈ రెండు ప్రాజెక్టులను ఒక దశకు తీసుకువచ్చి ప్రజల ముందుంచితే.. తన ప్రభుత్వానికి మన్నన దక్కుతుందని ఆయన ఆరాటపడుతున్నారు. అలాంటి క్రమంలో.. అమరావతి మౌలిక వసతుల కల్పన పనులకోసం వెచ్చించడానికి హడ్కో తొలివిడత రుణం డబ్బు అందివచ్చిన వార్త అందరికీ తెలిసిందే. అది అమరావతి పరంగా శుభవార్త కాగా, ఇప్పుడు పోలవరం విషయంలోనూ మరో శుభవార్త ఎదురుకానుంది. దాదాపు 3వేల కోట్ల రూపాయల తొలివిడత నాబార్డు రుణానికి ఆమోదం తెలిపేందుకు రంగం సిద్ధమవుతోంది.

పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక.. దానికి వెచ్చించే ప్రతిరూపాయి కేంద్రమే భరించాలి. అయితే అవసరమైన సొమ్మును నాబార్డు రుణంగా ఏర్పాటుచేసి.. తిరిగి చెల్లించుకోవడం తాము చేసుకుంటాం అని కేంద్రం ప్యాకేజీలో ప్రకటించింది. సదరు నాబార్డు రుణం తొలివిడత ఈనెల 23న జరిగే పాలకమండలి సమావేశంలో ఆమోదం పొందవచ్చునని అనుకుంటున్నారు.

ఇప్పటికే 2981 కోట్ల రూపాయల రుణపత్రంపై జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపారుట. ఆర్బీఐ ఓకే అనగానే రుణం విడుదల అయినట్టే. పాలకమండలి ఓకే చెప్పడం లాంఛనం అవుతుంది. చంద్రబాబునాయుడు 8వ తేదీన ముంబాయిలో సీఎంల కమిటీ సమావేశం సారథ్యానికి వెళ్లినప్పుడు.. ఆర్బీఐ గవర్నర్ ను కూడా కలిశారు. అప్పుడు కూడా వారి మధ్య పోలవరం నిధులకు నాబార్డు రుణం గురించిన ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

ఎటూ కాంక్రీటు పనుల ప్రారంభానికి చంద్రబాబు ముహూర్తం పెట్టేశారు. నాబార్డు నుంచి అంతరాయాలు లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల అవుతూ వస్తే.. పనులు జోరుగానే సాగే అవకాశం ఉంటుంది. యావత్తు రాష్ట్రానికి అది ఖచ్చితంగా శుభవార్తే అవుతుంది.

Similar News