వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాడి పక్కన పారేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ఇంకా పోరాడే సంకల్పంతోనే ఉంది. ఆ విషయాన్ని నిరూపించుకుంటూ.. విశాఖపట్టణంలో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్చిందేనంటూ వైకాపా డిమాండ్ చేయబోతోంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను కూడా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితర నాయకులు సోమవారం ఉదయం ఆవిష్కరించారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీ తొలినుంచి రోజుకోరకంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం.. ఒకటే వాదనకు కట్టుబడి ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఉపాధి అవకాశాలు సృష్టింపబడాలంటే.. విధిగా.. హోదా కావాల్సిందేననే డిమాండ్ ను వినిపిస్తూ వస్తోంది. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తున్నాడని కూడా వారు తరచూ ఆరోపిస్తున్నారు.
అయితే ఒక దశలో అరుణ్‌జైట్లీ రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించేసిన తరువాత.. ఇక ప్రత్యేకహోదా వస్తుందనే ఆశలు జనంలో సన్నగిల్లిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే జనం ఆ విషయం మరచిపోయారనే అనుకోవాలి. ప్రత్యేకహోదా సాధన సమితి నాయకులు, వామపక్షాల వారు తరచూ దాని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. రెండు సభలు పెట్టిన పవన్ కల్యాణ్ చాలా పెద్ద కేకలతో ప్రారంభించి.. తన పోరాట కార్యచరణ ప్రణాళిక ఏమిటో చెప్పకుండానే సైలెంట్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా హోదా కోరుకునే ప్రజాగళాన్ని ప్రతిధ్వనించాలని అనుకోవడం విశేషమే.