Cold Winds : చలి..పొగమంచు.. ఎక్కువవుతున్న రోడ్డు ప్రమాదాలు
ఉత్తర భారతం నుంచి మొదలయిన చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి
దేశంలో చలిగాలులు చంపేస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి మొదలయిన చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి. జాతీయ రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఒక్క గురువారమే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలలో రోడ్డు ప్రమాదాల్లో ముప్ఫయి మందికిపైగా మరణించారు. దట్టమైన పొగమంచు కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంత నిదానంగా వెళ్లాలనుకున్నప్పటికీ, పొగమంచు కారణంగా రెండు వాహనాలు ఢీకొని ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. పొగమంచు కమ్మేయడంతో ప్రయాణాలు కూడా ప్రమాదకరంగా మారాయని, అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళ్లల్లో ప్రయాణాలను మానుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు పదిహేను రోజుల నుంచి చలితీవ్రత తగ్గడం లేదు. అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. చలితో పాటు మంచు కురుస్తుండటంతో బయటకు వచ్చిన వారు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావద్దని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గుతుందని, తగినంత నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా చలితీవ్రత ఎక్కువగా ఉంది.
మరో మూడు రోజులింతే...
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏడు నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించినా ఆగడం లేదు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కుమ్రభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో చలి తీవ్రత పెరగడం గతంలో ఎన్నడూ లేదంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే వ్యాధులు బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.