దేశం నిర్ఘాంతపోయే స్థాయిలో నల్లధనం బయల్పడ్డ వ్యవహారంలో నిందితుడు అయిన శేఖర్ రెడ్డి ని టీటీడీ పాలకమండలి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నల్లకుబేరుల పంకిలం తిరుమల వెంకన్నకు అంటుకోకుండా ఉండడానికి.. చంద్రబాబు నాయుడు తనకు ప్రస్తుతానికి చేతనైన ప్రయత్నం చేసినట్లు అయింది. జయలలిత సిఫారసుతో టీటీడీ బోర్డు మెంబర్ పదవిని దక్కించుకుని, ఏనాడూ టీటీడీ వ్యవహారాలు, భక్తుల సదుపాయాల మీద కాకుండా.. తనకు అవసరమైన అతిథులకు దర్శనం ఏర్పాట్లు చేసుకోవడంలోనే తరించిన నల్ల కుబేరుడు శేఖర్ రెడ్డి వెంకన్న సేవకు ఆ రకంగా తెర పడింది.
ఐటీ సోదాల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో ముందు 70 కోట్ల విలువైన కొత్త నోట్లు దొరికిన సంగతి తెలిసిందే. అయితే కొనసాగిన సోదాల్లో మరొక 24 కోట్లు కొత్త నోట్లు కూడా దొరికాయి. కొత్త నోట్ల కోట్లను నిలవ చేయడం లోను శేఖర్ రెడ్డి సెంచరీ కొట్టేలా ఉన్నాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు మరొక వాదన వినిపిస్తోంది. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి అని పలువురు అంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతానికి అయన పదవిని తొలగించి బురద కడుక్కోడానికి ప్రయత్నించారు గానీ, అయన ఎలాంటి ఒత్తిళ్లకు లొంగి అలంటి వ్యక్తికి పదవి ఇచ్చారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.