ఎవరైనా లంచం అడిగితే తమకు ఫోన్ చేయడంటూ ఓ వైపు అధికారులు సెల్ ఫోన్లకు మెసేజ్ లు పంపిస్తున్నా.. ఏమాత్రం
వెనక్కి తగ్గలేదు లంచం రాయుళ్లు. తాజాగా హైదరాబాద్ అబిడ్స్లో ఓ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. లంచం ఇవ్వ లేదన్న కారణంతో ఓ ప్రైవేటు బస్ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం గాయపడిన బాధిత డ్రైవర్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ప్రయాణికుల ముందే డ్రైవర్ని కొద్దిదూరం తీసుకెళ్లికొట్టాడు కానిస్టేబుల్. నాంపల్లిలో జగన్ కు చెందిన ట్రావెల్ బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తున్నాడు డ్రైవర్. ఐతే, అప్పుడే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ సురేందర్, కృష్ణనాయక్ లు తనను లంచం డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో దాడి చేశారని బాధితుడు చెబుతున్నాడు. ఆటోలోకి ఎక్కించి మరీ కొట్టాడని వాపోయాడు. గతంలోనూ తనను పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లి కొట్టారని ఆవేదన వ్యక్తంచేశాడు బాధిత డ్రైవర్. దీనిపై డ్రైవర్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. రోజూ పనిచేసే తమపై పోలీసులు దాడి చేస్తే.. ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నాడు. తనపై దాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.