మెడలు వంచుతున్నాం .. మురిసిపోతున్న టీకాంగ్రెస్

Update: 2016-12-10 05:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంత అల్పసంతోషంతో మురిసిపోతున్నదో ఆ నాయకుల తీరు చూస్తే అర్థమవుతుంది. వారు సాధించిన విజయాలు, సాగించిన పోరాటాల గురించి చెబుతోంటే ఎవరికైనా నవ్వు వస్తుంది. అవును మరి.. ఫరెగ్జాంపుల్.. ‘‘సూర్యుడు రావాల్సిందే.. వెలుగు పంచాల్సిందే.. అని మేం డిమాండ్ చేశాం.. మా డిమాండుతో బెదిరిపోయిన సూర్యుడు భయపడిపోయి ఉదయం ఆరు గంటల కెల్లా తూర్పు దిక్కునుంచి ఆకాశంలోకి వచ్చేశాడు చూశారా’’ అని తమ విజయంగా టముకు వేసుకుంటే ఎలా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు కూడా అదే రకంగా సాగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ పెద్దస్థాయిలోనే కేసీఆర్ సర్కారు మీద పోరాటాలు సాగిస్తూ వస్తోంది. ఫీజు రీఇంబర్స్ మెంట్, రైతు సమస్యలపై వారు చాలా పోరాటాలు, ఆందోళనలు చేశారు. వారి ప్రయత్నాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. అయితే ఫీజుల రీఇంబర్స్ మెంట్ విషయంలో కేసీఆర్ సర్కారు గత నెలలో 300 కోట్లు విడుదల చేసింది. ఈ నెలలో మరో 300 కోట్లు ఇస్తున్నారు. ... అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం.. ఇదంతా ఎలా సాధ్యమైందనుకుంటున్నారు.. మేం పోరాటాలు చేయడం వల్లనే ప్రభుత్వం జడుసుకుని విడుదల చేసింది అని చెప్పకుంటున్నారు. అదొక్కటే అయితే సరే పోన్లెద్దూ.. అని సరిపెట్టుకోవచ్చు.

తెలంగాణ అసెంబ్లీని నిర్వహించడానికి షెడ్యూలు ప్రకటించడాన్ని కూడా తమ విజయంగానే ఆ పార్టీ నాయకుడు షబ్బీర్ ఆలీ చెబుతుండడం తమాషాగా ఉంది. శీతాకాలం ముగిసేలోగా డిసెంబరు, జనవరి నెలల్లో రాష్ట్రాల శీతాకాల సమావేశాలు జరగడం చాలా సహజమైన పరిణామం. పైన చెప్పుకున్న సూర్యుడు తూర్పున ఉదయించడం లాంటిదన్నమాట.

కొన్ని రోజుల కిందట వెంటనే అసెంబ్లీ పెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు గాంధీ బొమ్మ వద్ద కూర్చుని డిమాండ్ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకు ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. తమ డిమాండుకు భయపడే కేసీఆర్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారని షబ్బీర్ అంటోంటే.. కామెడీగా కనిపిస్తోంది.

ప్రభుత్వంలో ఏయే ఫైల్స్ మూవ్ అవుతున్నాయో తెలుసుకుని, ఏ నిర్ణయాలు రాబోతున్నాయో తెలుసుకుని.. ఆ డిమాండ్లు చేసేసి.. తమ డిమాండు వల్లనే ప్రభుత్వం భయపడి నిర్ణయం తీసుకున్నదని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా షబ్బీర్ సారూ!!

Similar News