తమిళనాడు నూతనముఖ్యమంత్రిగా ఓ. పన్నీర్ సెల్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. 1.25 గంటల సమయంలో పదవీ స్వీకార ప్రమాణం చేశారు. జయలలిత మరణం నేపథ్యంలో.. అత్యంత విషాదభరితమైన వాతావరణంలోనే రాజ్ భవన్ లో అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు.. ఆయనతో పదవీస్వీకార ప్రమాణం చేయించారు.
జయలలిత మరణం నేపథ్యంలో ఆయన ఒక్కరే సీఎంగా ప్రమాణం మాత్రం చేశారు. కేబినెట్ మంత్రుల ప్రమాణాలు ఈరోజు జరగలేదు. పన్నీర్ సెల్వం గతంలో మూడు సార్లు రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా, భక్తుడిగా పన్నీర్ సెల్వంకు పేరుంది. తాను అమ్మ జయలలిత పరోక్షంలో ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి వచ్చిన రోజుల్లోనూ.. సీఎంగా జయలలిత కూర్చునే కుర్చీలో కూడా ఎన్నడూ కూర్చోకుండా.. అక్కడ ఆమె ఫోటో పెట్టుకుని, పక్కనే మరో కుర్చీ వేయించుకుని అందులో కూర్చుంటూ పాలన సాగించినంతటి అమ్మ భక్తుడిన అందరూ అంటుంటారు.
రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో జయలలిత మరణానికి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
దేశం ఓ శక్తిమంతమైన నాయకురాలిని కోల్పోయిందంటూ దేశవ్యాప్తంగా కూడా సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి.
చంద్రబాబు సంతాపం :
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత దేశం ఒక శక్తిమంతమైన నాయకురాల్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు. ప్రజా జీవితంలో ఆమె ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని శ్లాఘించారు. ఎన్టీఆర్ తో ఆమెకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవని గుర్తు చేస్తూ, తమిళనాట అందరికీ అమ్మగా నిలిచి నిజమైన నాయకురాలిగా జన్మ సార్ధకం చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నో ఒడుదుడుకులను ఆటుపోట్లనూ తట్టుకున్న నాయకురాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.