చంద్రబాబు నాయుడు వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సచివాలయం లోని ముఖ్యమంత్రి కార్యాలయంలోకి మరి కాసేపట్లో ప్రవేశించబోతున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ఉదయం 8.09 నిమిషాలకు ఆయన ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ సమయానికి వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఆరు బ్లాకుల్లో 5వది అయిన ముఖ్యమంత్రి కార్యాలయ బ్లాక్ లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంకా అనేక హంగులు దిద్దవలసి ఉంది. ఎంత వేగంగా నిర్మాణాలను పూర్తి చేసినప్పటికీ.. ఇంకా కొన్ని పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు తన కార్యాలయంలో లాంఛనంగా మాత్రమే ప్రవేశిస్తారు. పూజాదికాలు నిర్వహించి లాంఛనంగా సీఎంగా అక్కడినుంచి పని ప్రారంభిస్తారు. కార్యాలయంలో ఏర్పాట్లు అన్నీ పూర్తి స్థాయిలో అయిన తరువాత.. ఈనెల 20వ తేదీనుంచి ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం ఈ భవనం నుంచే పని ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, చీఫ్ సెక్రటరీ కార్యాలయం కూడా ఈ బ్లాకులోనే ఉంటుంది.
తాత్కాలిక సచివాలయ సముదాయం ఉన్న వెలగపూడి వద్ద మొత్తం ఆరుబ్లాకులను ఏర్పాటుచేస్తున్న సంగతి పాఠకులకు తెలుసు. ఇందులో నాలుగు బ్లాకుల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు, పనులు ప్రారంభం అయ్యాయి. మంత్రిత్వ శాఖలు అన్నీ ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాయి. 5వది ముఖ్యమంత్రి కార్యాలయ బ్లాక్ కాగా, 6వది అసెంబ్లీ మరియు శాసనమండలి కి సంబంధించిన బ్లాక్.
రక్షణ చర్యల్లో అనుపమానం..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండే సచివాలయ బ్లాక్‌కు చాలా పెద్దస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేపడుతుండడం విశేషం. బ్లాక్ కు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లనే వినియోగిస్తున్నారు. రాకెట్ లాంచర్లతో దాడులు జరిగినాసరే.. భవనం చెక్కుచెదరకుండా ఉండే స్థాయి భద్రత ఏర్పాట్లతో ఈ బ్లాక్‌ను తీర్చిదిద్దుతున్నారు. మొత్తం ఏడు లిఫ్ట్ లు ఉండే బ్లాక్‌లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కోసం ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇలాంటి అనేక ఆధునికర సాంకేతిక హంగులతో ఏర్పాటవుతున్న సీఎం కార్యాలయం మరికొద్ది సేపట్లో లాంఛనంగానూ, 20 వతేదీనుంచి పూర్తిస్థాయిలోను ప్రారంభం కానున్నది.