ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. తండ్రితో ఉన్న విబేదాలను సీఎం అఖిలేష్ యాదవ్ తారస్థాయికి తీసుకువెళుతున్నారు. తన మంత్రివర్గంలోని బాబాయి మరియు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన శివపాల్ యాదవ్ మరో నలుగురు కేబినెట్ మంత్రుల మీద అఖిలేష్ యాదవ్ వేటు వేశాడు. వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాడు. దీంతో విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లయింది. ఈ సంక్షోభం రెండు మూడు రోజుల్లోనే కొలిక్కి వచ్చేస్తుందని కూడా పలువురు అనుకుంటున్నారు.
అఖిలేష్ యాదవ్ అధికారానికి కత్తెర వేయాలని ములాయం సింగ్ యాదవ్ అనుకున్న నాటినుంచి పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అయితే శివపాల్ మాత్రం .. గుంభనంగా, పార్టీ మళ్లీ గెలిస్తే అఖిలేషే సీఎం అనే చెబుతున్నారు. మరోవైపు ములాయం పార్టీ గెలిస్తే.. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, నా ఇష్ట ప్రకారం సీఎం ఉంటారు.. లాంటి డైలాగులు వేశారు.
ఈ నేపథ్యంలో అఖిలేష్ సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నాలు ముందుకు వెళుతున్నట్లు కూడా పాఠకులకు తెలుసు. తాజాగా బాబాయ్ శివపాల్ యాదవ్ మరో నలుగురు తండ్రి వర్గానికి చెందిన మంత్రుల మీద బర్తరఫ్ వేటు వేయడం ద్వారా అఖిలేష్.. తాను చాలా మొండిగానే వెళ్లదలచుకున్నానని స్పష్టం చేసినట్లుగా ఉంది.
మరింతగా ముదురుతున్నాయ్
తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. మంత్రుల బర్తరఫ్ నేపథ్యంలో ఒకవైపు ములాయం సింగ్ తనకు అనుకూలురైన వారితో ఓ సమావేశం నిర్వహించడానికి ప్రయత్నిస్తుండగా, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు అందరితో అఖిలేష్ ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు.