నేతలకు వాతపెట్టే డిమాండ్‌ వినిపించిన గవర్నర్‌!

Update: 2016-10-06 02:20 GMT

ఒక్కసారి ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిపోతే గనుక, ఒక్కరోజు వారికి పూటుగా తాగించి, నోట్లకట్టలు వెదజల్లి వారిని మాయలో పెట్టి.. అధికారం దక్కించుకుంటే గనుక.. ఇక అయిదేళ్ల దాకా మనకు తిరుగుండదు.. అనేదే రాజకీయ నాయకులకు ఉండే అభిప్రాయం..! మన రాజ్యాంగం ప్రకారం అంతే! కానీ.. ఆ అయిదేళ్లలో వారి దుర్మార్గాలు హద్దుమీరిపోతే... వారు గెలిపించిన ప్రజలనే కబళించేసే ప్రజాకంటకులుగా మారిపోతే పరిస్థితి ఏమిటి? వారిని అయిదేళ్లకు ముందే గద్దె దించే హక్కు (రీకాల్‌ హక్కు) ఉండాలనే డిమాండ్‌ ఈ దేశంలో మేధావుల వర్గాల్లో చాలాకాలంగా వినిపిస్తోంది.

అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కూడా.. ఇదే డిమాండ్‌ను వినిపించారు. రాజకీయ నాయకులను రీకాల్‌ చేసే హక్కు ప్రజలకు ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు.

హైదరాబాదులో దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారుల సమావేశం జరిగిన నేపథ్యంలో దానిని ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌, రీకాల్‌ హక్కుగురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అయితే నరసింహన్‌ లాంటి వాళ్లు ఎందరు ఇలాంటి ప్రతిపాదనలు చేసినా.. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాజకీయ నాయకులే. తమ గోతిని తామే తవ్వుకునే నిర్ణయం వారెందుకు తీసుకుంటారనేది ప్రశ్న. అందుకే 'రీకాల్‌ హక్కు' అనేది ఈ దేశంలో అందని ద్రాక్ష లాగా ఉండిపోతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు.

Similar News