దారుణం...ఒకే ఇంట్లో ఏడుగురి మృతి

Update: 2017-12-22 03:30 GMT

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన జిల్లాలోని రాజాపేటలో జరిగింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజాపేటలోని నాగభూషణం కోళ్ల ఫారం వద్ద ఓ ఇంట్లో స్థానికులకు ఏడుగురి మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడ గ్రామవాసి అయిన బాలరాజు.. నెల రోజుల నుంచి భార్య(తిరుమల)తో కలిసి యాదాద్రి జిల్లాలోని రాజాపేటలో ఉన్న నాగభూషణం కోళ్ల ఫారంలో పని చేస్తున్నాడు. భార్యా, ముగ్గురు పిల్లలతో కోళ్ల ఫారం దగ్గరలోని ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుమార్తె కుటుంబాన్ని చూసేందుకు గురువారం తిరుమల తల్లిదండ్రులు రాజాపేట వచ్చారు. వారు వచ్చిన రోజే అందరూ మృతి చెందారు. ఇదిలా ఉండగా, ఒకే కుటుంబానికి చెందిన వీరంతా నిద్రిస్తున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోడానికి కారణమేంటి..? వీళ్లంతా ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా..? లేక వీరు తీసుకున్న ఆహారం వల్లనే ఇలా జరిగిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల్లో ఇద్దరు వృద్ధ దంపతులు కాగా, వారి కుమార్తె తిరుమల, అల్లుడు బాలరాజు, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News