దశాబ్దాల క్రితం నాటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Update: 2017-02-25 08:50 GMT

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండు వేరు వేరు రాష్ట్రాలుగా విడిపోయి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హోదాలో నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్ర శేఖర రావు సుపరిపాలన అందిస్తున్నారు. అయితే దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరిరువురు ఒక గూటికి చెందిన వారే. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? పాత విషయమే అయినా దగ్గుబాటి మూడు తరాల సెలబ్రిటీస్ తో నేటి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తెలుగు దేశం పార్టీలో లోకసభ సభ్యుడిగా సేవలు అందిస్తున్న రోజులలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రామానాయుడు స్టూడియోలో కొత్త బ్లాక్ ప్రారంభోత్సవానికి ఆయన అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు చంద్ర బాబు నాయుడు తోపాటు అప్పటి తెలుగు దేశం పార్టీ కీలక నేత, కాబినెట్ మంత్రివర్యులైన కే.సి.ఆర్ ని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవాన్ని వారి చేతుల మీదుగా నిర్వహించారు. అప్పటికి వెండితెరకు ఇంకా పరిచయం కాని నేటి తరం యువ కథానాయకుడు రానా దగ్గుబాటి ముఖ్యమంత్రికి ఒక వైపున, అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ మరో వైపు నిలబడి వున్న ఈ ఫోటో దగ్గుబాటి ఫామిలీ అభిమానులకి కన్నుల పండుగ అవుతోంది. ఈ ఫోటో చూసి, ఆ ఫొటోలోని ప్రముఖుల ప్రస్తుత హోదాలు చూస్తుంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఎన్నో మలుపులు తిరుగుతూ సాగిపోతుంది అని అనిపించక మానదు.

Similar News