తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే జాతీయ హోదా లభిస్తుందా? త్వరలో అంటే.. కనీసం వచ్చే ఎన్నికలకు ముందుగా అయినా సరే.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా మాత్రం గ్యారంటీ అని పలువురు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.
ఏపీకి పోలవరం ను జాతీయ హోదాతో కేంద్రం గుర్తించిన నాటినుంచి తెలంగాణ నాయకులంతా కాళేశ్వరం ను కూడా జాతీయ హోదాతో గుర్తించాలని కోరుతున్నారు. నిజానికి కేంద్రం దీన్ని గురించి పట్టించుకోలేదు.
తెలంగాణ రాష్ట్రసమితి సర్కారు ఏర్పడిన తర్వాత పలుమార్లు ఇదే విజ్ఞప్తిని కేంద్రం వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం మాత్రం లేదు. అవునూ కాదూ అని చెప్పకుండా మోదీ సచివులు తమ సహజశైలిని ప్రదర్శించారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం కు జాతీయహోదా కోసం జరిగే పోరాటానికి బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పాలిట్ బ్యూరోలో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తమ పార్టీ తరఫున మోదీ సర్కారుపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. దీనికి అదనంగా భాజపా వైపు నుంచి కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా.. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తానంటూ ఇటీవల ప్రకటించారు.
ఈ రకంగా అన్ని పార్టీలూ ఉద్యమించడానికి పూనుకుంటున్న తరుణంలో త్వరలోనే ఈ ప్రాజెక్టుకు హోదా రావడం గ్యారంటీ అని పలువురు ఆశిస్తున్నారు.