Andhra Pradesh : ఖజానా డొల్ల.. ఆంధ్రప్రదేశ్ కు రానున్నవి గడ్డు రోజులే
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ సిబ్బందికి వేతనాల చెల్లింపు కూడా ఒకటో తేదీకి కష్టంగా మారింది. ఆదాయం పెరగకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరగడం ఈ ఆర్థిక సంక్షోభానికి కారణాలుగా విశ్లేషకులు సయితం చెబుతున్నారు. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014 నుంచి మొదలయిన ఆర్థిక సంక్షోభం నేటికి తీవ్ర రూపం దాల్చింది. ఆదాయానికి, ఖర్చులకు కపొంతన లేకుండా ఉంది. అలాగని పాలకులు సంక్షేమ కార్యక్రమాలకు గండికొట్ట లేని పరిస్థితి. రానున్న కాలంలో ఏపీని పాలించే వారు తీవ్ర ఇబ్బందులు పాలవుతారన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపడుతుంది.
ఇబ్బడి ముబ్బడి హామీలు...
అసలు రాష్ట్రం ఎటువైపు పోతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. 2014 నుంచి అధికారంలోకి రావడానికి ఇబ్బడి ముబ్బడిగా అన్ని పార్టీలూ హామీలు ఇచ్చాయి. వాగ్దానాలు అమలు చేయకపోతే ప్రజలు మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిపించరేమోనన్న భయంతో ఇటు టీడీపీ, అటు వైసీపీ నాయకత్వం హామీల వర్షం కురిపించింది. వాటిని అమలు చేయడమే తలప్రాణం తోకకు వచ్చేలా ఉంది. పింఛన్లు ఏకంగా నాలుగువేల రూపాయలకు పెంచేశారు.దీంతో ఖజానాపై అదనపు భారం పడింది. నెల మొదటి తారీఖు వచ్చేసరికి పాలకులతో పాటు అధికారుల్లోనూ గుండెదడ మొదలవుతుంది. ఏనెలకానెల అప్పులు తెచ్చి సర్దిపెడుతున్నారు. రానున్న కాలంలో ఇది మరింత భారంగా మారనుందని, అది మరింత ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త జీఎస్టీ విధానంతో...
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త జీఎస్టీ విధానం కూడా రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్ లో ఈ విధానం అమలులోకి వచ్చినప్పటికీ, పూర్తి స్థాయి ప్రభావం నవంబర్ లో కనిపించింది. అక్టోబర్ కన్నా నవంబర్ లో నాలుగు శాతానికన్నా ఎక్కువగా ఆదాయం తగ్గినట్లు తేలింది. నూతన జిఎస్టి విధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తగ్గుతున్న ఆదాయానికి ప్రత్యామ్నాయం చూపలేదు. గత ఏడాది అక్టోబర్ లో 2,777 కోట్లు ఆదాయం రాగా, నవంబర్ లో 2,827 కోట్లు వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ లో 3,021 కోట్లు రాగా, నవంబర్ లో కేవలం 2,697 కోట్లు మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు.. ఇది 4.60 శాతం తక్కువగా ఉన్నట్లు తేల్చారు ఏడాదికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గే అవకాశం ఉందని అధికారులు గతంలో అంచనా వేశారు. అయితే, తాజా తగ్గుదలను పరిగణలోకి తీసుకుంటే అంతకన్నా ఎక్కువగా ఉంటుందని భావించి ఆందోళన చెందుతున్నారు.
వడ్డీల చెల్లింపునకు...
ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం కూడా దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాన్ని తీసుకు వచ్చారు.ఆ భారం కూడా భవిష్యత్ లో ఏపీ ఖజానాపై పడనుంది. వివిధ సంస్థలకు వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అప్పుడు ప్రభుత్వసిబ్బందికి వేతనాలను చెల్లించడం కూడా సవాల్ గా మారే అవకాశముందంటున్నారు. మరొకవైపు పన్నుల వసూళ్లు సక్రమంగా జరగకపోవడం కూడా ఒక కారణమన్నవిశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక అనేక వర్గాల గొంతెమ్మ కోర్కెలు తీర్చాలని అనుకున్నా పాలకులకు సాధ్యపడే అవకాశం లేదు. అలాగని సంక్షేమ పథకాలకు గండి కొట్టలేరు.అది రాజకీయ అవసరం. అందుకే పాలకులకు పాలన ఇక రానున్న రోజుల్లో కత్తిమీద సామే. సంపద సృష్టి జరగడం మాట దేవుడెరుగు.. ఉన్నదంతా ఆవిరవుతుందన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తుంి. రానున్న కాలంలో ఏపీకిమరింత కష్టాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.