తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ వెంకయ్యా అంటే...

Update: 2016-12-14 16:00 GMT

తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ వెంకయ్యా అంటే.. దూడ గడ్డి కోసం.. అని చెప్పాట్ట వెనకటికి ఒక పెద్దమనిషి. ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యవహారం కూడా అచ్చం అలాగే ఉంది. ఇంత ఉన్నపళంగా నోట్లు ఎందుకు రద్దు చేసారు సామీ... అని యాతనలు పడుతున్న జనం అడుగుతోంటే అయన డొంకతిరుగుడు బుకాయింపు సమాధానాలు చెబుతున్నారు. దేశంలోని ప్రజలందరినీ డిజిటల్ లావాదేవీల వైపు నడిపించడమే ప్రభుత్వం యొక్క అసలు ఉద్దేశ్యం అని ఆయన సెలవిస్తున్నారు.

రోజులు గడిచేకొద్దీ ప్రజల కష్టాలు ఇసుమంతైనా తగ్గుముఖం పట్టకపోవడం.. అదేసమయంలో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్లు సర్కారు కూడా గుర్తించడం జరుగుతోంది. అయితే ప్రజలకు ఉపశమనం కలిగించడం ఎలాగో వారికి బోధపడుతున్నట్లు లేదు. అందుకే వెంకయ్య డిజిటల్ బుకాయింపులను ఆశ్రయిస్తున్నారు. ప్రజల జీవన శైలిని మెరుగు పరచడం కోసమే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదని అయన చెబుతున్నారు. ఇంతకూ వెంకయ్య దృష్టిలో జీవనశైలి మెరుగుపడడం అనగా.. ఈ కష్టాల పరంపరో.. లేదా, డిజిటల్ లావాదేవీలో అర్ధం కావడం లేదు.

వెటకారం పుష్కలంగా నిండిన డైలాగ్ లను సంధించడంలో వెంకయ్య ఘనాపాటి అయిఉండొచ్చు. అయినంత మాత్రాన జనం మీద, అదికూడా వారు కష్టాలు పడుతున్న సమయంలో ఇలాంటి వెటకారం ప్రయోగిస్తే వారికి పుండు మీద కారం రాసినట్లుగా ఉంటుందని అనడంలో సందేహం లేదు.

Similar News