సికింద్రాబాద్ కంట్మోనెంట్ ఏరియాలో దారుణం జరిగింది. డిల్లీ నిర్భయ తరహాలో ఈసంఘటన చోటు చేసుకుంది. ఆర్మీలో పనిచేస్తున్న జవాను కూతురిపైనే అత్యాచారం జరిగింది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత నిందితులెవరో తేలుస్తామంటున్నారు పోలీసులు. సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ లోని అమ్ముగూడ ప్రాంతంలో జవాన్ తన కుటుంబంతో ఉంటున్నారు. ఒడిషాకు చెందిన ఆ జవాన్ కు భార్య, కూతురు ఉన్నారు. కూతురు బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతోంది. చదువులో వెనకబడి ఉండటంతో అదే ప్రాంతంలో ప్రయివేటు ట్యూషన్ కు పంపుతున్నారు. ట్యూషన్ కోసం బయటకు వచ్చిన ఆ అమ్మాయిని ఒక ముసుగు ధరించి ఉన్న వ్యక్తి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండటంతో బాలిక ఏమీ చేయలేకపోయింది. బాలిక అరుపులు వినకుండా ఉండేందుకు దుండగుడు నోట్లో గుడ్డలు కుక్కాడు. అత్యాచారం చేసిన తర్వాత తలపై రాడ్డుతో కొట్టి గాయపరిచాడు. అయితే ఈ సంఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఇప్పటి వరకూ పోలీసులు నిందితుడిని పట్టుకోలేక పోయారు. ఆ ప్రాంతంలో ఉన్న నలభై మంది యువకులను ప్రశ్నించారు. వారి వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతనే నిందితులెవరో తేల్చగలమని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఆధారాల కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.