జస్టిస్ లోయా కేసులో సంచలన ఆదేశాలు

Update: 2018-01-16 07:54 GMT

జస్టిస్ బీఎం లోయా అనుమానాస్పద మృతి కేసులో అన్ని యథార్థాలు పిటిషనర్లకు తెలియాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో వైద్య నివేదికతోపాటు అన్ని డాక్యుమెంట్లను పిటిషనర్లు పరిశీలించేందుకు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న సమయంలో సీబీఐ జడ్జి జస్టిస్ బీ ఎం లోయా మరణించారు. ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గత గురువారం అంగీకరించింది. మంగళవారం నాలుగు నిమిషాలపాటు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. ఇది పిటిషనర్లకు అన్ని విషయాలు తెలియవలసిన కేసు అని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

రెండు ప్రజా ప్రయోజనాలు....

ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తోంది. ఒక పిల్‌ను బంధురాజ్ శంభాజీ అనే జర్నలిస్టు దాఖలుచేయగా, మరొకదానిని రాజకీయ ఉద్యమకారుడు తెహసీన్ పూనావాలా దాఖలు చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు. అన్ని డాక్యుమెంట్లను పిటిషనర్లకు అందజేయడానికి అభ్యంతరం లేదని, అయితే, పిటిషనర్లు ఆ డాక్యుమెంట్లను బహిరంగపరచకూడదని అన్నారు. సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించిన విధంగా అన్ని డాక్యుమెంట్లను సీల్డ్ కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సమర్పించింది. విచారణను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. పిటిషనర్లు అదనపు డాక్యుమెంట్లను సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చునని పేర్కొంది.

Similar News