YSRCP : ఒక స్టాండ్ అంటూ లేకపోతే ఎలా గురూ?

రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదని అర్ధమవుతుంది

Update: 2026-03-31 08:55 GMT

రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదని అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వారు ఇప్పటికీ గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నట్లు కనపడుతుంది. తాజాగా మూలాపేట పోర్టు కోసం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఆందోళన చేశారు. భారీ బహిరంగ సభ పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం వరకూ ఓకే. అయితే రాజధాని అమరావతి విషయంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి మరింత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

మూడు రాజధానులంటూ వెళ్లినా...
గత వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులంటూ ప్రతిపాదన చేశారు. ఉభయసభల్లోనూ తీర్మానం చేసి పంపారు. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కూటమి పార్టీలు మాత్రం ఏకైక రాజధాని అమరావతి అంటూ తన నినాదానికి పరిమితమై ఎన్నికలకు వెళ్లారు. కానీ మూడు ప్రాంతాల్లో కూటమి పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనకు ప్రజలు అంగీకరించలేదని స్పష్టంగా ఫలితాల ద్వారా వెల్లడయింది.
తాజాగా సీనియర్ నేతలు...
అయితే తాజాగా సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలను సెంటిమెంట్ తో తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో సీనియర్ నేతలు ఆ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనుకోవాలి. చట్టబద్ధత కల్పించినా సరే రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, పరిపాలన వికేంద్రీకరణ అవసరమని చేసిన వ్యాఖ్యలతో తిరిగి కోస్తాంధ్రతో పాటు ఇతర రాయలసీమ ప్రాంతంపై కూడా ఈ వ్యాఖ్యల ప్రభావం పడుతుందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. మరి వైసీపీ నాయకత్వం రాజధాని పై తమ స్టాండ్ ను ఇప్పటికైనా తెలియపర్చకపోతే మరోసారి నష్టపోయే ఛాన్స్ లేకపోలేదు.






Tags:    

Similar News