Janasena : ముందు చూపు లేకుంటే... ముప్పు పొంచి ఉంటుందేమో?
జనసేన పార్టీ ఇప్పటి నుంచే నేతల కోసం అన్వేషణ చేయాల్సి ఉంటుంది
జనసేన పార్టీ ఇప్పటి నుంచే నేతల కోసం అన్వేషణ చేయాల్సి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇస్తున్నారన్న అపప్రధ నుంచి పవన్ కల్యాణ్ ఈ సారైనా తప్పించుకోవాలి. గత ఎన్నికల్లో కేవలం 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టిక్కెట్లు కేటాయించారు. పేరుకు జనసేన అయినా అందులో ఎక్కువగా టీడీపీ నుంచి వచ్చిన నేతలే ఎక్కువ ఉన్నారన్న విమర్శలను ఆయన ఇప్పటికీ సొంత పార్టీ నేతల నుంచి ఎదుర్కొంటున్నారు. ఈసారి ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశముంది.
ఆరోపణలు అందుకే...
అంతెందుకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా టీడీపీ నేత సిఫార్సు మేరకే టిక్కెట్ ఇచ్చారని, ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కొందరు ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ గుర్తు చేస్తుంది. అనేక ఆరోపణలు వస్తున్నాయంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఒరిజినల్ జనసేన కార్యకర్తలను, నేతలను పట్టించుకోవడం లేదని అనేక ప్రాంతాల నుంచి నేరుగా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. టీడీపీ, వైసీపీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇస్తే వారితో పాటు వచ్చిన కార్యకర్తలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారని, తమను ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
మూడేళ్లు ముందు నుంచే...
అందుకే ఈసారి మూడేళ్ల ముందు నుంచే నేతలను తయారు చేసుకునేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. అప్పుడు ఒరిజినల్ జనసేన కనపడుతుందని, ఆరోపణలు కూడా తగ్గుతాయని, పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ చెప్పే సూత్రాలను నమ్మి పనిచేస్తారంటున్నారు. అప్పటికప్పుడు నేతల కోసం వెదుకులాడే కంటే ఇప్పటి నుంచే కొన్ని నియోజకవర్గాలను, బలమైన వాటిని గుర్తించి అక్కడ నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే వారే రేపు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సులువుగా గెలుస్తారని, నాయకత్వంపై క్యాడర్ లో నమ్మకం కూడా ఏర్పడుతుందని సోషల్ మీడియా వేదికగా కొందరు పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.