Congress : మంత్రి పదవులు రాకనే ఈ ఫ్రస్టేషన్... ఇద్దరూ ఓపెన్ అయ్యారుగా?

కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారారు

Update: 2026-03-31 12:35 GMT

కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారారు. మంత్రి పదవు లభించలేదన్న అక్కసుతో సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అది ప్రభుత్వానికి, పార్టీకి కూడా ఇబ్బంది కరంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిలు రెండు సభల్లో చేసిన ప్రసంగాలు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. స్వపక్షంలోనే విపక్షంలా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ కావడంతో వారికి ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుందని భావించినా అది పార్టీని, ప్రభుత్వాన్నిమాత్రం డ్యామేజి చేస్తుందన్నకామెంట్స్ వినపడుతున్నాయి.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోనూ, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని శాసనసభలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే ముఖ్యమంత్రి అయినా.. మంత్రులయినా ఉంటారని, ఎమ్మెల్యేలే గెలవకపోతే.. ముఖ్యమంత్రి పదవి ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని, అభివృద్ధి పనులు జరగకపోతే తాము ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. రాకపోవడంతోనే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాములమ్మ ఫైర్...
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా శాసనమండలిలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదననారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు. ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం ఇస్తామని భరోసా కూడా ఇచ్చామని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి కూడా మంత్రి పదవి పై ఆశ పెట్టుకుని అది నెరవేరకపోవడంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారంటున్నారు.


Tags:    

Similar News