జనం సొమ్ము 9 కోట్లు కొల్లగొట్టి....!

Update: 2018-02-21 06:32 GMT

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల నుంచి అక్షరాలా 8కోట్ల 94లక్షల 89వేల రూపాయల నగదు మాయమైంది. 1976లో ప్రారంభమైన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జులై, 2010 నుంచి , పిభ్రవరి 2018 మధ్యలో యాభై మంది ఖాతాదారులకు చెందిన 8కోట్ల 94లక్షల 89వేల రూపాయల నగదు గల్లంతైనట్లు ఈనెల 7న సి.బి.ఐ. ఏ.సి.బి. కి ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ మందాల రవీందర్ రెడ్డి లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు.

దొంగలందరూ బ్యాంకు ఉద్యోగులే....

ఈ పిర్యాదుపై సి.బి.ఐ. ఈనెల19న కేసు నమోదు చేసింది. సి.బి.ఐ. నమోదు చేసిన కేసులో మెత్తం 10 మంది బ్యాంకు ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. వీరిలో ఆఫీసు తాత్కాలిక పార్టుటైం స్వీపర్ తో పాటు ఒక రిటైర్ ఉద్యోగి కూడా ఉండటం విశేషం. అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆఫీసు అసిస్టెంట్ మాది జైపాల్ రెడ్డి, బ్యాంకు మేనేజర్ జె.మోజెస్, బ్రాంచ్ మేనేజర్ కె. లక్ష్మీ నర్సయ్య, బ్రాంచ్ మేనేజర్ కె.చంద్రయ్య, బ్రాంచ్ మేనేజర్ జి. శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ ఈ. రాజన్న, బ్యాంకు అధికారి, ప్రస్తుతం వెలిమినేడులో పనిచేస్తున్న బి. రవికాంత్, రిటైర్ ఉద్యోగి వి.వి.జె.రామారావు, బ్యాంకు ఎకౌంటెంట్ పి.గురుప్రసాద్, తాత్కాలిక పార్టుటైం స్వీపర్ మాది శ్రీనివాస రెడ్డి ఉన్నారు. బ్యాంక్‌లో శాఖాపరమైన ఆడిటింగ్‌ జరుగుతుండగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై బాధ్యులను గుర్తించేందుకు శాఖపరమైన విచారణ అనంతరం కథ సి.బి.ఐ.కి చేరింది.

Similar News