గులాబీ బాస్ ‘బ్రాండ్ న్యూ’ స్ట్రాటెజీ!

Update: 2016-10-22 11:03 GMT

గులాబీ బాస్ ఏ స్కెచ్ వేసినా అదిరిపోయేలా ఉంటుంది. రాజకీయమైనా, సంక్షేమ పథకాలైనా.. సూపర్ హిట్టే. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటులోనూ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా.. అవుననే అనిపిస్తోంది. పది జిల్లాలను 31 జిల్లాలు చేయడమే కాదు.. ఆయా జిల్లాల్లో నేరుగా ప్రజల్లోకి పార్టీని చేర్చే ఆలోచనతో ఉన్నారట ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఇప్పటికే రెపరెపలాడుతున్న గులాబీ జెండాను.. మారుమూల పల్లెల్లో, గూడాల్లో, తండాల్లో ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారట. కొత్తగా ఏర్పడిన జిల్లాలు పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా వ్యూహాలు సిద్ధం చేశారట. పార్టీ వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడగానే.. కాంగ్రెస్, తెదేపాలు కూడా కొత్త జిల్లా కమిటీలు ఏర్పాటుచేసే కసరత్తులో ఉండగానే, కేసీఆర్ ఇదే విషయంలో కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నారు.

అధికార చెందిన కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో పార్టీ అధ్యక్షులుగా చేసే యోచనలో ఉన్నారట కేసీఆర్. ఎమ్మెల్యేలను జిల్లాలకు అధ్యక్షులుగా చేయడం ద్వారా పార్టీని ఆయా జిల్లాల్లో మరింత విస్తరించాలని భావిస్తున్నారట. దీనిపై ఒక నిర్ణయానికి కూడా వచ్చిన ముఖ్యమంత్రి.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పార్టీకి కొత్త కమిటీలను నియమించాల్సిన అవసరం ఏర్పడడంతో.. ఆయా జిల్లాలకు కమిటీలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. పాలనకు సంబంధించి ఒక్కో మంత్రికి కనీసం రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారట కేసీఆర్. పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయాలని నిర్ణయించారు.

కొత్త జిల్లాల్లో ఇప్పటికే పాలన మొదలవడంతో.. దీపావళి నాటికి కొన్ని జిల్లా కమిటీలను నియమించే ఆలోచనలో ఉన్నారు సీఎం. కొత్తగా ఏర్పడ్డ 125 మండలాలకు కూడా మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. వీటితోపాటూ పార్టీ అనుబంధ సంఘాల పదవులన్నీ ఖాళీగానే ఉండడం, విద్యార్థి యువజన, మహిళా కార్మిక విభాగాలకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను భర్తీ చేయాల్సుంది. కొత్త జిల్లాలు పార్టీ పదవుల సంబరం మొదలవడంతో ఇటు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతోంది. పార్టీని నమ్ముకున్న ప్రతి నేతకూ ఈసారీ ఏదో ఒక పదవి దక్కుతుందనే ఆనందం వ్యక్తమవుతోంది. పనిలోపనిగా పార్టీని బలోపేతం చేయాలన్న కేసీఆర్ వ్యూహం కూడా కచ్చితంగా నెరవేరనుంది.

Similar News