ఉమాభారతి తో పోలవరం కాంక్రీట్ పనులకు శ్రీకారం

Update: 2016-12-05 20:32 GMT

పోలవరం పనులు కీలకఘట్టంలో పడ్డాయి. కాంక్రీట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్రంనుంచి ప్రతిపనికీ సాయం ఉండాలని ఆశిస్తున్న చంద్రబాబు.. ఇదివరకు అమరావతి నగర కార్యక్రమాల్లో మోదీని, జైట్లీని భాగస్వాముల్ని చేసినట్లుగానే.. పోలవరం పనుల్లో ఉమాభారతితో కూడా టెంకాయ కొట్టించాలని అనుకుంటున్నారు.

ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాంక్రీట్ పనులకు డిసెంబర్ 19న శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సహా ప్రముఖులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ పనులను జనవరి మొదటివారంలో, ఫాబ్రికేటింగ్ గేట్ల ఏర్పాటును సంక్రాంతి కల్లా మొదలు పెట్టాలని నిర్దేశించారు. ఈ మూడు మైలురాళ్లను శరవేగంగా చేరుకోవాలని చెప్పారు. వచ్చేవారం 12వ తేదీ కల్లా ప్రాజెక్టు పనులకు సంబంధించిన మిషనరీ అంతా నిర్మాణ ప్రాంతంలో సిద్ధంగా వుండాలన్నారు.

వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పనులు సాగుతున్న తీరును వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు.

మొత్తంమ్మీద ఈవారంలో 2.92 లక్షల క్యూబిక్ మీటర్ల స్పిల్ వే, 8.10 లక్షల క్యూబిక్ మీటర్ల స్పిల్ చానల్, 2.34 లక్షల క్యూబిక్ మీటర్ల పవర్ హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు జరిగాయి. డిసెంబరులో ముఖ్యమంత్రి నిర్దేశించినట్టుగా స్పిల్‌ వేకు సంబంధించి 11.67 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్ చానల్‌ 52.98 లక్షల క్యూబిక్ మీటర్లు, పవర్‌హౌస్‌ ఫౌండేషన్‌ 10.72 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తి చేయాల్సి వుంది.

Similar News