ఆర్కే నగర్ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడుతుందా? ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న తీరు మరోసారి ఎన్నికల కమిషన్ ను ఆలోచింప చేస్తుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఈ నెల 21వ తేదీన జరగనుంది. అయితే అక్కడ అభ్యర్థులగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ లు కోట్లకు కోట్లు గుమ్మరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా ఈరోజు కూడా ఆర్కే నగర్ లో 30 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరోసారి ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయినప్పుడు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్న విషయం ఎన్నికల కమిషన్ కు తెలియడంతో ఎన్నికను రద్దు చేశారు. తిరిగి ఆరు నెలల తర్వాత నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
120 కోట్లు పంచారని ఫిర్యాదు...
అయితే ఈసారి కూడా విచ్చలవిడిగా డబ్బులు ఓటర్లకు ఇస్తున్నారన్న విషయం ఎన్నికల కమిషన్ కు పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటుకు ఆరువేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నారని డీఎంకే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దినకర్ ఓటుకు నాలుగువేల రూపాయలు ఇచ్చారని, అన్నాడీఎంకే, దినకరన్ కలిసి దాదాపు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా అన్నాడీఎంకే అభ్యర్థిగా అండగా నిలుస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు విధించినా ఆర్కే నగర్ లో మాత్రం కోట్లుకు కోట్లు పంచుతున్నారన్న విషయం రచ్చ అయింది. మరి ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.