ఆర్.బి.ఐ తీరుపై పవన్ ఆగ్రహం

Update: 2016-12-21 11:00 GMT

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యకు చాలా ఆలస్యంగా తన స్పందన తెలిపిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి వరుస ట్వీట్లతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ వచ్చారు. కరెన్సీ కష్టాలు అతి త్వరలో సమసిపోతాయి అంటూ ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు కేంద్ర మంత్రులు చేస్తున్నప్పటికీ నగదు అందుబాటులో లేక, బ్యాంకు ల వద్ద, ఏ.టి.ఎం ల వద్ద బారులు తీరిన వరుసలలో పడిగాపులు కాస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతుండగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ లు అవలంభిస్తున్న తీరుపై మండిపడ్డారు.

దేశంలోని నల్ల ధనాన్ని వెలికి తీస్తామంటూ తగు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్.బి.ఐ సంయుక్తం గా తీసుకున్న ఏమరుపాటు చర్యలకు సామాన్య పౌరులు అష్ట కష్టాలు పడుతున్నారని గతంలో నిలదీసిన పవన్ కళ్యాణ్, తాజాగా బ్యాంకులలో కొత్త కరెన్సీ కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోయిన పలువురు దేశ పౌరుల తరపున నిలబడుతూ, "చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతులు, రైతు కూలీలు, రోజు వారి వేతనాలకు పని చేసే కార్మికులు రోడ్డున పడటానికే తప్ప నల్ల కుబేరులు బైటకు రావటానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. సామాన్య పౌరుడి పై జులుం విధించటానికేనా మీరు ప్రభుత్వం నడుపుతుంది? అతి త్వరలో కరెన్సీ కష్టాలు తీరిపోతాయి, అన్ని బ్యాంకులకు అవసరమైన కొత్త నోట్లు సరఫరా ప్రక్రియ జరుగుతుంది అని పదే పదే ఉర్జిత్ పటేల్ పత్రికా విలేకరులకు తెలపటమే తప్ప ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు అని ఏ.టి.ఎం ల వద్ద బారులు తీరిన జనాన్ని చూస్తేనే అర్ధం అవుతుంది. ఇప్పటికి కూడా నిరక్షరాస్యత రాజ్యమేలుతున్న దేశంలో నగదు రహిత లావాదేవీలు అంటూ ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?" అంటూ మరోసారి పెద్ద నోట్ల రద్దు పై తనదైన శైలి లో వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్.

Similar News