ఆంధ్రప్రదేశ్ కు వార్ధా తుపాను పొంచి ఉంది. సోమవారం నుంచి ఏపీలో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నదని హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ తీరం పొడవునా ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవ్వరూ వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత జిల్లాలన్నింటినీ అప్రమత్తం చేస్తున్నారు.
విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950 కి.మీ. దూరంలోను, మచిలీపట్నానికి 1050 కి.మీ.ల దూరంలోను వాయుగుండం కేంద్రీకృతమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. విశాఖ తీరంలో వాయుగుండం అంతకంతకూ బలపడుతోందని... గంటకు 7 కి.మీ. ల వేగంతో ప్రయాణిస్తున్నదని తెలుస్తోంది. శనివారం రాత్రి వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఆదివారం నుంచి కోస్తా జిల్లాల్లో వర్షాలుంటాయి.
12వ తేదీన మచిలీపట్నం- నెల్లూరు మధ్యలో తుపాను తీరం దాటవచ్చునని కోస్తా ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అసలే ప్రజలు నోట్ల రద్దు దెబ్బకు నానా కష్టాలు పడుతూ పనులు సాగకుండా, వ్యాపారాలు సాగకుండా అవస్థలు పడుతూ ఉంటే.. తుపాను దెబ్బ తీవ్రంగా ఉంటే గనుక.. జనజీవితం మొత్తం అతలాకుతలం అయిపోయే ప్రమాదం ఉంది. తుపాను హెచ్చరికలను జారీచేయడంతో పాటూ.. ఏపీ ప్రభుత్వం ముందే విపత్తు నిర్వహణకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.