అరుణ్ జైట్లీ : బాధ్యత మరచిన పలాయనవాదం!

Update: 2016-11-12 12:05 GMT

నల్లధనం కట్టడి ప్రయత్నాల్లో భాగంగా.. మోదీ సర్కారు నోట్ల మార్పిడి వ్యవహారాన్ని హఠాత్తుగా తెరమీదకు తీసుకువచ్చింది. దానివల్ల దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. పరిమితంగా కొందరు మోదీ నిర్ణయాన్ని తూర్పారపడుతున్నా.. మెజారిటీ కష్టాలు పడుతూ సర్దుకుంటూనే ఉన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతోంటే.. మోదీ జపాన్ పర్యటనకు వెళ్లడాన్ని కూడా విపక్షాలు కొందరు తప్పుబట్టారు. దాని మీద కూడా బలవంతంగా ఏదో ముడిపెట్టి విమర్శలు చేయడానికి ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో రెండు మూడురోజులుగా ఉన్న పరిస్థితులు, ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావించారు. అయితే జైట్లీ మాటలను స్థూలంగా గమనిస్తే.. ప్రజలు పడుతున్న బాధలకు ప్రభుత్వం ఎంత మేరకు బాధ్యత వహించాలో.. ఆ మేరకు బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయకుండా.. ఆయన పలాయన వాదం ప్రదర్శించారు. 86 శాతం నగదు మార్పిడి ఇంకా జరగాల్సి ఉన్నదని అరుణ్ జైట్లీ అంటున్నారు. ఇది ఎంతగా ఆత్మవంచనతో కూడుకున్న మాటో.. ఎంతో మేధావి అయిన అరుణ్ జైట్లీకి తెలియనిది కాదు. సంఖ్యాపరంగా పెద్దసంఖ్యలో జనం బ్యాంకులకు వచ్చి నగదు మార్పిడి చేసుకుని ఉండవచ్చు గాక. కానీ వారికి ఒక్కొక్కరికి ఇచ్చింది రెండేసి వేల రూపాయలు మాత్రమే అనే సంగతి జైట్లీ మరచిపోతే ఎలా అని జనం ప్రశ్నిస్తున్నారు. జనం చేతిలో ఆ రెండు వేల రూపాయలు రెండు రోజుల్లో ఖర్చయిపోవడం గ్యారంటీ. పైగా బ్యాంకుల్లో నగదు మార్చుకుని పాత నోట్ల స్థానే కొత్త రెండు వేల నోట్లు జనం తీసుకుంటున్నారే గానీ.. దాన్ని దుకాణాల్లో మార్చుకోవడానికి వారికి వీలు కావడం లేదు. 2000 రేంజిలో ఖర్చు పెడితే తప్ప.. చిల్లర కొనుగోళ్లకు ఆ పెద్దనోట్లు ఉపయోగపడడం లేదు. దుకాణాల వారు చిల్లర కొరత వల్ల తీసుకోవడం లేదు. ఇలా ప్రాక్టికాలిటీలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అరుణ్ జైట్లీ బాధ్యతగల మంత్రిగా.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం తరఫున మన్నింపు కోరుకుని, మరికొన్ని రోజులు ఈ కష్టాలు తప్పవని, ఈలోగా మొత్తం పరిస్థితులు సెట్ అయిపోతాయని సలహా చెప్పిఉంటే చాలా బాగుండేది. ఆయన కనీసం జనం కష్టాల గురించి సానుభూతి కూడా చూపించలేదు. బ్యాంకుల ద్వారా అంతా చాలా అద్భుతంగా జరిగిపోతున్నదని, ఎస్‌బిఐలో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయో గణాంకాలు చెప్పి.. జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కొత్త 2000 నోట్ల సైజుకు పనిచేసేలా ఏటీఎంలో మార్పులు చేయాల్సి ఉన్నదని.. అందుకే ఏటీఎంలు పనిచేయడం లేదని, మరో మూడు రోజులు పడుతుందని చాలా సింపుల్ గా చెప్పేశారు జైట్లీ. కానీ ఆ మార్పులు చేయడానికే రెండు రోజుల పాటూ ఏటీఎంలను మూతపెట్టారనే సంగతి ఆయన విస్మరించారు. ఆ రెండు రోజుల్లో ఆ పని చేయలేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం అని ఆయన ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వ పరంగా ఎన్నెన్ని వైఫల్యాలు ఉన్నాయో.. వాటిని కప్పిపెట్టుకుంటూ.. అంతా సజావుగా ఉన్నట్టు.. జనం ఇబ్బందులు అంటూ ఎవరైనా మాట్లాడితే.. వారు విపక్షాలకు చెందిన వారుగా, కుట్ర పూరిత ప్రచారం చేస్తున్న వారుగా అభివర్ణిస్తున్నట్టు జైట్లీ ప్రసంగం సాగడం గర్హనీయంగా ఉంది.

Similar News