తొలినుంచి ఏ విషయంలో అయితే అందరూ భయపడుతున్నారో అదే జరిగింది. జయలలితకు ఎలాంటి ఉపద్రవం జరిగినా సరే.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు అపోలో ఆస్పత్రిని దహించేస్తాయని ముందునుంచి భయపడుతున్నారు. అందుకే జయలలిత పరిస్థితి సీరియస్ అయినప్పటినుంచి అపోలో ఆస్పత్రి చుట్టూ పోలీసు బలగాలను పెంచారు. సీఆర్పీఎఫ్, బ్లాక్ కమాండోస్ ను కూడా మోహరించారు. సోమవారం ఉదయమే ఓసారి అభిమానులు బారికేడ్లను ఛేదించుకుని ఆస్పత్రిలోకి దూసుకువెళ్లడానికి ప్రయత్నించగా, పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అయితే సాయంత్రానికి వారిని అదుపు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాకుండా పోయింది. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత.. అమ్మ పరిస్థితి అనుమానంగా ఉండడంతో.. అభిమానులు అపోలో ఆస్పత్రి మీద దాడికి దిగారు. ఆస్పతిర మీద రాళ్లు రువ్వారు. బారికేడ్లను ఛేదించుకుని దూసుకెల్లిపోయారు. పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి.
అమ్మ జయలలిత గురించి ఎలాంటి దుర్వార్త బయటకు వచ్చినా సరే.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు ఆస్పత్రి మీద పడతాయని ముందునుంచి యాజమాన్యం అనుమానిస్తూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత.. ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు అందరినీ.. ప్రత్యేక వాహనాల్లో ఇతర ఆస్పత్రులకు తరలించేశారు. కొందరు రోగులను ప్రత్యేక విమానాలు పెట్టి మరీ ఇతర ఆస్పత్రులకు తరలించడం జరిగింది. అయితే ఇలాంటి పరిణామాలు అన్నీ ఆస్పత్రి బయట నిరీక్షిస్తున్న అభిమానుల్లో అనుమానాలను పెంచుతూనే ఉన్నాయి.
జయలలిత గురించి ఎలాంటి దుర్వార్తను ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. అభిమానుల్లో ఆగ్రహం మాత్రం సాయంత్రానికి కట్టలు తెంచుకుంది. ఆస్పత్రి మీద దాడికి దిగడం గమనార్హం. పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు జోక్యం చేసుకుని అభిమానుల్ని చెదరగొట్టి.. ఆస్పత్రి ఆవరణ నుంచి వీలైనంత దూరంగా పంపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రి మీద వారు రాళ్లు చెప్పులు విసరుతున్నారు. కార్లు, హోర్డింగులు ఇతరత్రా కంటికి కనిపించే వాటన్నింటినీ ధ్వంసం చేసేస్తున్నారు.
జయలలిత గురించి ఎలాంటి దుర్వార్త బయటకు వచ్చినా సరే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అల్లర్లు చెలరేగుతాయని అనుమానిస్తున్నారు.