అపర భక్తుడికే అమ్మ వారసత్వం!

Update: 2016-10-11 15:43 GMT

ఒక రకంగా తమిళనాడు లో జయలలిత వారసత్వ ఎంపిక జరిగినట్లే! ముఖ్యమంత్రి అనే హోదానుంచి జయలలిత తప్పుకుని, ఆ పదవిని మరొకరికి అప్పగించకపోయినప్పటికీ.. దాదాపుగా ఆ స్థాయి అధికారాలు అన్నిటినీ.. జయలలితకు అపరభక్తుడిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు దఖలు పరిచారు. జయలలిత చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖలు అన్నిటినీ పన్నీర్ సెల్వంకు బదలాయించారు. జయలలిత పరోక్షంలో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించే అధికారాన్ని కూడా పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 166వ అధికారణం ప్రకారం ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

తమిళనాడు లో ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇప్పట్లో ఒక కొలక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రోజువారీ వీవీఐపీలు జయపరామర్శకు వస్తున్నప్పటికీ కనీసం ఆమెను చూడడం వరకు అనుమతించని వైద్యులు, ఆమె ఇంకా కొన్నాళ్ల వరకూ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు వారాలుగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నారు.

ఒక రకంగా చూస్తే ఆమె పరోక్షంలో తమిళనాడులో ప్రభుత్వం దాదాపుగా స్తంభించినట్టే అనుకోవాలి. అయితే జయలలిత ఆస్పత్రికి పరిమితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతాయంటూ బాగా పుకార్లు వచ్చాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వెళ్లి గవర్నర్ ను కలవడం కూడా పుకార్లకు కారణమైంది. శశికళ కేబినెట్ భేటీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని మరో పుకారు వచ్చింది. ఇంటర్మ్ సీఎంను పెడతారని, వేర్వేరు ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. వాటన్నిటినీ పక్కకు నెడుతూ.. ముఖ్యమంత్రిగా జయలలిత చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖలు , కేబినెట్ భేటీ నిర్వహించే అధికారాలను మాత్రం పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

పన్నీర్ సెల్వం జయలలితకు వీరభక్తుడు. ఆమెకు జైలుకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఆయన చేతిలోనే సీఎం పదవిని పెట్టి వెళ్లింది. ఆ రోజుల్లో పన్నీర్ సెల్వం జయలలిత రెగ్యులర్ గా కూర్చునే కుర్చీలో కూడా కూర్చునే వాడు కాదని, పక్కనే మరో కుర్చీ వేయించుకుని అందులో కూర్చుని సీఎం గా బాధ్యతలు నిర్వర్తించేవాడని అంటుంటారు. అంతటి వీరభక్తుడు గనుకనే.. ఇప్పుడు అమ్మ పరోక్షంలో అధికారం చెలాయించే బాద్యత కూడా దక్కిందన్నమాట.

Similar News