జగన్ పై వత్తిడి.. పొత్తుకు యత్నం

జగన్ బీజేపీతో పొత్తుకు సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. వీలయినంత తొందరలోనే పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2022-08-19 05:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసు మార్చుకుంటున్నారా? ఆయనపై వత్తిడి ఎక్కువవుతుందా? బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్నట్లుగా పార్టీ సీనియర్లు సయితం దీనిని కాదనే పరిస్థితి లేదు. బీజేపీతో పొత్తు అవసరం గురించి కొందరు సీనియర్ నేతలతో పాటు, జగన్ సన్నిహితులు, బంధువులు సయితం గురించి కూడా ఆయన చెవిలో పోరు పెడుతున్నారని సమాచారం. జగన్ కు అనుకూలరైన పారిశ్రామికవేత్తలు సయితం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని సూచిస్తుననారు. జగన్ కూడా కొంత ఒగ్గారన్నది తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

తొలి నుంచి ఒంటరిగానే...
నిజానికి జగన్ తొలి నుంచి ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తూ వచ్చారు. పొత్తులకు ఆయన తొలి నుంచి వ్యతిరేకం. సింగిల్ గానే పోటీ చేయడానికి ఆయన తొలి నుంచి సిద్ధమవుతూ వచ్చారు. కానీ ఈసారి ఈక్వేషన్లు మారాయి. మారుతున్నాయి కూడా. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయితో ప్రత్యామ్నాయంగా కాలేదు. ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక లోక్ సభ స్థానాల్లోనూ పెద్దగా విజయం సాధించే అవకాశం లేదు. ఇటీవల జాతీయ మీడియా సంస్థలు చేయించిన సర్వేలు కూడా అవే తేల్చాయి. దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
బాబు స్పీడ్ పెంచడంతో...
ఈ నేపథ్యంలో మరో వైపు చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అన్ని రకాలుగా చర్యలు ప్రారంభించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా ఇప్పుడు మిత్రుల అవసరం ఉంది. వరసగా మిత్రులు ఎన్డీఏ నుంచి వెళ్లిపోతుండటంతో జాతీయ స్థాయిలో బీజేపీకి కొందరు మిత్రులు అవసరం. జగన్ ఇప్పటి వరకూ బీజేపీకి అన్ని రకాలుగా పరోక్షంగా మద్దతిస్తూనే వచ్చారు. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు కాని బీజేపీ ఏం చేసినా జగన్ అందుకు ఓకే అనడం తప్ప నో అనలేదు. నమ్మకమైన మిత్రుడుగా జగన్ బీజేపీకి ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
నేరుగా భాగస్వామి...
కానీ ఎన్డీఏలో భాగస్వామిగా లేరు. అయితే జాతీయస్థాయిలో తమ పరువును నిలబెట్టుకునేందుకు బీజేపీ 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి కొన్ని పార్టీలను తెచ్చుకోవాలనుకుంటుంది. టీడీపీ ప్రయత్నాలకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. తాము తొందరపడకుంటే చంద్రబాబు మరోసారి బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ప్రమాదముందని జగన్ కు కొందరు సన్నిహితులు చెబుతుండటంతో ఆయన కూడా కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. కాకుంటే కొంత మైనారిటీ ఓట్లు దెబ్బతినే అవకాశాలున్నాయి. అర్బన్ ప్రాంతంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినా అవుట్ రైట్ గా బీజేపీతో ముందుకు వెళితే చంద్రబాబుకు అన్ని రకాలుగా చెక్ పెట్టవచ్చన్నది జగన్ పార్టీ వ్యూహంగా ఉంది. కుదిరితే ఈ రెండేళ్లలోనే నేరుగా పొత్తు కుదుర్చుకుని కేంద్ర మంత్రివర్గంలోనూ భాగస్వామ్యయ్యే అవకాశాలును కొట్టిపారేయలేం.


Tags:    

Similar News