గోరంట్ల పని ఫినిష్ అయినట్లేనా?

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ కావడంతో జగన్ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి విచారణ చేేపట్టాలని అధికారులను ఆదేశించారు

Update: 2022-08-05 06:18 GMT

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసే వారు కొందరు. అయితే తమకు పట్టిన అదృష్టాన్ని చేజేతులారా నాశనం చేసుకునే వారు మరికొందరు. రాజకీయ నేతల్లో అలాంటి నేతలు చాలా మంది ఉంటారు. ఏదో ఒక కారణంగా తమ పదవులను కోల్పోవడం, ప్రతిష్టను దిగజార్చుకోవడం షరా మామూలయింది. అందులో గోరంట్ల మాధవ్ ఒకరు. ఇప్పుడు ఆయన న్యూడ్ వీడియో వాస్తవం తేలితే పార్టీ పరంగా చర్యలు తీసుకునే వీలుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ వీడియో వాస్తవ విషయంపై నిఘా వర్గాలు సమాచారం అందించారని తెలిసింది. ఈ వీడియో వైరల్ కావడంతో వైసీపీ అధినేత జగన్ కూడా సీరియస్ అయినట్లు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విచారణ నివేదిక వచ్చిన తర్వాత గోరంట్ల మాధవ్ పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈరోజు, రేపో ఆయన పై చర్యలుంటాయని పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డు గా చెబుతున్నాయి.

అనుకోకుండా....
గోరంట్ల మాధవ్ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లోకి సులువుగా ప్రవేశించగలిగారు. గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి రాకముందు కదిరి సీఐగా పనిచేశారు. ఆయన పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో జేసీ సోదరుల పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించడం, మీసం మెలేయడంతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. పోలీసులను అంటే నాలుక చీరేస్తానంటూ హెచ్చరించారు. ఆ సమయంలోనే వైసీపీ అధినేత జగన్ కంట్లో పడ్డారు.
ఊహించని విధంగా...
దీంతో జగన్ సూచన మేరకు 2018లో ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు టిక్కెట్ ను గోరంట్ల మాధవ్ కు జగన్ పిలిచి ఇచ్చారు. ఊహించినట్లుగానే ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గోరంట్ల మాధవ్ కు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. ఒక సీఐ ఒక ఏడాదిలో పార్లమెంటుకు వెళ్లడం ఆయనతో పాటు కుటుంబం కూడా ఊహించి ఉండరు. రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వెళుతున్నాడేమో అని కుటుంబ సభ్యులు కూడా వారించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
శత్రువుల సంఖ్య.....
గత మూడేళ్లుగా పార్లమెంటు సభ్యుడిగా గోరంట్ల మాధవ్ మంచి పేరే తెచ్చుకున్నారు. అదే సమయంలో తన వ్యాఖ్యలతో విపక్షాల్లో శత్రువుల సంఖ్యను కూడా బాగానే పెంచుకున్నారు. దీంతో పాటు సొంత పార్టీలో కూడా గోరంట్ల మాధవ్ ను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తనకు సంబంధం లేని ప్రాంతంలో ఆయన పర్యటిస్తుండటం కూడా వివాదంగా మారింది. దీంతో ఆయనకు సొంత పార్టీలోనే శత్రువుల సంఖ్య ను కూడా పెంచుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూడ్ వీడియో బయటకు రావడం ఆయనకు, ఆయన రాజకీయ భవిష్యత్ కు ఇబ్బంది కరంగా మారనుంది.


Tags:    

Similar News