Karnataka results : యడ్డీ లేక "నడ్డి" విరిగింది

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా కనిపించింది. లింగాయత్‌లు దూరమయ్యారు

Update: 2023-05-13 05:54 GMT

అనుకున్నట్లే జరిగింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా కనిపించింది. కర్ణాటక పోలింగ్ ప్రారంభమయిన నాటి నుంచి లెక్కింపు వరకూ కాంగ్రెస్ ఆధిక్యంలో వస్తుందన్న అంచనాలు వచ్చాయి. బీజేపీ దారుణంగా వెనుకపడి పోవడానికి కారణం యడ్యూరప్ప ప్రభావమేనని చెప్పక తప్పదు. ఎవరు అవునన్నా కాదన్నా కర్ణాటకలో యడ్యూరప్ప ను వేరు చేసి ఎన్నికలను చూడలేం. ఆయనను లింగాయత్‌లు అంతగా నమ్ముతారు. ఆయన నాయకత్వం అయితేనే లింగాయత్‌లు అందరూ గంపగుత్తగా ఓట్లు వేస్తారు.

లింగాయత్‌లు...
కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే లింగాయత్ సామాజికవర్గం దూరమయినట్లే కనిపిస్తుంది. బీజేపీ తన నియయ నిబంధనల ప్రకారం 70 ఏళ్లు దాటిని వారికి పదవుల్లో నియమించరు. యడ్యూరప్ప కు ఏడు పదుల వయసు దాటడంతో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ అధినాయకత్వం తప్పించింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను నియమించింది. బసవరాజు బొమ్మై కూడా లింగాయత్ సామాజికవర్గమే అయినప్పటికీ ఆయనను అంతగా ఓన్ చేసుకోలేకపోయిందనే అనుకోవాలి.
ఎన్నికలకు దూరంగా..
బీఎస్ యడ్యూరప్ప ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపారు. ఇది లింగాయత్‌ సామాజికవర్గంలో కొంత అసహనం, ఎక్కువగా అసంతృప్తి ఉన్నట్లు ఈ ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. మోదీ, అమిత్ షా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారన్నది కమలనాధులు కూడా అంగీకరించాల్సిన విషయం. దక్షిణ భారత దేశంలో బీజేపీకి పట్టున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే అయినా, అక్కడ బీజేపీ హైకమాండ్ యడ్యూరప్పను తొలగించి ప్రయోగం చేసింది. కానీ ఆ ప్రయోగం మాత్రం వికటించిందనే చెప్పాలి.
పదవి ఇవ్వక...
యడ్యూరప్పకు కనీసం కేంద్రంలోనైనా గౌరవ ప్రదమైన పదవి ఇవ్వకపోవడాన్ని కూడా లింగాయత్‌లో ఒకరమైన ఏహ్య భావం ఏర్పడింది. గవర్నర్ పదవి అయినా ఇస్తారనుకున్నారు. తమ సామాజికవర్గం నేతకు పార్టీ అధినాయకత్వం అన్యాయం చేసిందన్న అభిప్రాయంతో లింగాయత్‌లు ఉన్నారు. యడ్యూరప్ప రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినా ఆయనకు ఎలాంటి పదవులు, అధికారాలు లేకపోవడంతో ఎవరూ ఆయనను విశ్వసించలేదని చెబుతున్నారు. బీజేపీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావడానికి యడ్యూరప్పను తప్పించడమే ప్రధాన కారణమని ఎక్కువ మంది చెబుతున్నారు. కానీ యడ్యూరప్ప లాంటి నేత బీజేపీకి కర్ణాటకలో దొరకడం భవిష్యత్‌లోనూ కష్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News