Telangana : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు బీఫారాలు అందచేశారు. బాగా పనిచేసే వారికి, పార్టీకి తొలి నుంచి కష్టపడిన వారికి బీఫారాలు అందచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రులు నేతలకు రేపు ఉదయం బీఫారాలను అందచేస్తారు. రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 117మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయించాలంటే వారికి పార్టీ నుంచి బీఫారాలు అందచేయాల్సి ఉంటుంది.
వివక్ష చూపకుండా...
అయితే అధికారంలో ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తమకు బీఫారాలు అందచేయాలని నేతలపై వారు వత్తిడి తెస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు కూడా బీఫారాలు ఇవ్వడంలో వివక్ష చూపుతారని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఆ యా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రెబల్స్ ఎవరూ ఉండకుండా మంత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.
రెబల్స్ ను తప్పించి...
స్థానిక నాయకుల ఆలోచనల మేరకు గత పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలని, వారికే బీఫారాలు ఇవ్వాలని, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే వారికి తర్వాత కార్పొరేషన్ పదవులు ఇస్తామని నచ్చచెప్పి పోటీ నుంచి తప్పుకునేలా వారిని ఒప్పించాలని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ప్రచారంలో కూడా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజలకు హామీలను ఇవ్వాలని, అలాగే మంత్రులు కూడా నిరంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని, రాష్ట్ర వ్యాప్తంగా 85 శాతం మున్సిపాలిటీలు గెలుచుకుని రావాలని రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.