బెజవాడ టీడీపీ స్టీరింగ్ కేశినేని చేతికి?

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జిల్లాలో పార్టీ పై ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.

Update: 2021-11-24 07:35 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జిల్లాలో పార్టీ పై ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కేశినేని నాని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. తాను లేకుంటే జిల్లాలో టీడీపీ లేదన్న సంకేతాలను ఇటు క్యాడర్ కు, అటు నేతలకు కేశినేని నాని పంపుతున్నట్లే ఉంది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని ఇప్పుడు కీలకంగా మారారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా కేశినేనికి ప్రాధాన్యత ఇస్తుండటం కనపడుతుంది.

మొన్నటి వరకూ...
మొన్నటి వరకూ కేశినేని నాని పార్టీలో అసంతృప్తి నేతగా ఉండేవారు. ముఖ్యంగా జిల్లా నేతలైన దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావులను శత్రువులుగా చూసేవారు. అప్పట్లో తమ నివాసంలో ఉన్న పార్టీ అర్బన్ కార్యాలయాన్ని తీసివేయడంపై కూడా కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కేశినేనిపై బొండా ఉమ, బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్నారు.
యాక్టివ్ కావడంతో....
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కేశినేని నాని చంద్రబాబుకు చెప్పి వచ్చారన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు 36 గంటల దీక్ష శిబిరానికి హాజరయిన కేశినేని నానితో పార్టీ అధినేత ఏకాంతంగా మాట్లాడారు. అప్పడే చంద్రబాబు చెప్పిన మాటలకు కేశినేని నాని కన్విన్స్ అయ్యారంటున్నారు. చంద్రబాబు దీక్ష తర్వాత కేశినేని నాని తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయన తన పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారు. బెంజ్ సర్కిల్ లోని ఫ్లై ఓవర్ నుకూడా పరిశీలించారు.
ఉమతో పడకపోయినా?
తాజాగా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలను కూడా కేశినేని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేవినేని ఉమను వ్యతిరేకించినా, ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఎన్నిక జరుగుతున్నా తాను కీలకంగా మారి టీడీపీకి పదవి దక్కడంలో కేశినేని కీలక పాత్ర పోషించారు. దేవినేని ఉమ అని అక్కడ చూడలేదు. పార్టీ అని మాత్రమే ఆయన చూశారని కేశినేని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద బెజవాడ తెలుగుదేశం పార్టీ పై కేశినేని నాని గ్రిప్ పెరిగిందనే చెప్పాలి.


Tags:    

Similar News