డాడీ.. దాడి వెనక రీజన్ అదేనట

వసంత నాగేశ్వరరావు సీనియర్ నేత. ఎంతో అనుభవమున్న నాయకుడు. ఆయన నోటి నుంచి చంద్రబాబును ఎప్పుడూ పొగడలేదు.

Update: 2022-11-25 03:12 GMT

వసంత నాగేశ్వరరావు సీనియర్ నేత. ఎంతో అనుభవమున్న నాయకుడు. ఆయన నోటి నుంచి చంద్రబాబును ఎప్పుడూ పొగడలేదు. ఎన్టీఆర్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావు ఆ తర్వాత కాంగ్రెస్ లోనే ఎక్కువ కాలం రాజకీయం చేశారు. నందిగామ నియోజకవర్గంలో దేవనేని కుటుంబాన్ని ఎదుర్కొనే నేతగా పేరొందారు. దేవినేని రమణ, దేవినేని ఉమలను ఆయన నందిగామలో ఓడించలేకపోయారు. ఆయన వయసు మీదపడటంతో తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కు అప్పగించారు. 


టీడీపీలో ఎదుగుదల లేక...

వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరి టిక్కెట్ కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. నందిగామ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో మైలవరానికి దేవినేని కుటుంబం షిఫ్ట్ అయింది. వసంత ఫ్యామిలీ కూడా సేమ్ అదే పంథాను అనుసరించింది. మైలవరం నియోజకవర్గం కమ్మ సామాజికవర్గానికి పెట్టని కోట. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కమ్మ సామాజికవర్గం నుంచి మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అందుకే నందిగామ రిజర్వడ్ కావడంతో ఇరు కుటుంబాలు మైలవరానికి మారిపోయాయి.
వైసీపీలోకి రాగానే...
కానీ టీడీపీలో దేవినేని ఉమామహేశ్వరరావు ఉండటంతో ఆ పార్టీలో వసంతకు ఎప్పటికీ ఛాన్స్ రాదు. అది తెలిసే 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి మైలవరం టిక్కెట్ సాధించుకున్నారు. జగన్ హవా కావచ్చు. దేవినేని పై ఉన్న అసంతృప్తి కావచ్చు. సుదీర్ఘకాలం తర్వాత వసంత కుటుంబం అసెంబ్లీలోకి కాలుమోపింది. అయితే మొన్నటి వరకూ వైసీపీ హైకమాండ్ పై వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావుకు సాఫ్ట్ కార్నర్ ఉండేది. తన కొడుకును ఎమ్మెల్యేను చేసింది వైసీపీయేనంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించేవారు. జగన్ పై కూడా ప్రశసంలు కురిపించేవారు.

జోగికి మంత్రి పదవి ఇచ్చినందుకేనా?
కానీ ఉన్నట్లుండి ఆయన ఛేంజ్ అయ్యారు. దానికి కారణం మంత్రి జోగి రమేష్ కారణమని చెబుతున్నారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తీసిన తర్వాత ఆ సామాజికవర్గం కోటాలో తన కుమారుడికి మంత్రి పదవి వస్తుందని గట్టిగా వసంత నాగేశ్వరరావు నమ్మారు. కానీ రాలేదు. తన కుమారుడికి మంత్రి పదవి రాకపోయినా పరవాలేదు కానీ జోగి రమేష్ కు మంత్రి పదవి రాకూడదని గట్టిగా భావించారు. తన కుమారుడికి మైలవరంలో చికాకుగా మారిన జోగి రమేష్ కు మంత్రి పదవి దక్కుతుందని పెద్దాయన ఊహించలేదట.
జోగి vs వసంత....
జోగి రమేష్ కు మంత్రి పదవి రావడంతో వసంత నాగేశ్వరరావు మదిలో జగన్ పట్ల నెగిటివ్ భావం ఏర్పడింది. అందుకే కమ్మ సామాజికవర్గం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మైలవరం నియోజకవర్గం జోగి రమేష్ సొంతం. 2014 ఎన్నికల్లో ఆయన మైలవరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి దేవినేని ఉమ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా తన అనుచరగణాన్ని మాత్రం ఇప్పటికీ లైమ్‌లైట్ లోనే ఉంచుతున్నారు. తాను పెడన నియోజకవర్గం నుంచి గెలిచినా దృష్టి మాత్రం మైలవరం మీదనే. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను చికాకు పుట్టిస్తున్న కారణంగానే వసంత నాగేశ్వరరావుకు ఎక్కడో కాలిందట. అందుకే కమ్మ సామాజికవర్గం వనభోజనాల్లో ఇలా కామెంట్స్ చేశారని, జోగిరమేష్ కు కాకుండా మరొకరికి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇలా మాట్లాడే ఉండేవారు కాదని, జగన్ ను కార్నర్ చేసే వారు కాదన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News