ఏంది బాబూ ఈ లెక్కలు..? కులాలా? పార్టీలా?

వంగవీటి రాధా అంశం ఇప్పుడు ఏపీని ఊపేస్తుంది. తనపై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ చేసిన ఆరోపణలు సంచలనమే అయ్యాయి

Update: 2021-12-28 03:11 GMT

వంగవీటి రాధా అంశం ఇప్పుడు ఏపీని ఊపేస్తుంది. తనపై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ వంగవీటి రాధా చేసిన ఆరోపణలు సంచలనమే అయ్యాయి. రాధాపై హత్యకు కుట్ర చేసిందెవరు? అన్న దానిపై చర్చ జరుగుతుంది. నిజానికి వంగవీటి రాధా కు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ మంచి మిత్రులు. ఈ ముగ్గురికి దేవినేని కుటుంబానికి కొంత గ్యాప్ ఉంది. అయితే ఈ రెక్కీ జరిపింది బెజవాడలోని ఒక గ్రూపు అని వంగవీటి రాధా తన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. వంగవీటి రాధాకు ఒక అడ్వాంటేజీ ఉంది. ఆయనను కాపులు ఎంతగా అభిమానిస్తారో, అదే సమయంలో కమ్మ సామాజికవర్గం కూడా ఆదరిస్తుంది.

గ్రూపుల మధ్యన....
దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొడాలి నాని చేతిలో ఓటమి పాలయిన కొద్ది రోజులకే దేవినేని అవినాష్ వైసీపీ గూటికి చేరిపోయారు. ఆయనను ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా వైసీపీ అధినాయకత్వం నియమించింది. దేవినేని అవినాష్ దృష్టంతా వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుంది.
శత్రువేమీ కాదు....
దేవినేని అవినాష్ కు వంగవీటి రాధా ప్రధాన శత్రువేమీ కాదు. రెండు కుటుంబాల మధ్య వైషమ్యాలు వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ మరణంతోనే సమసిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరూ తమ రాజకీయ ఎదుగుదలపైనే దృష్టిపెడతారు. దేవినేని కుటుంబానికి వల్లభనేని వంశీకి, కొడాలి నానికి పడదు. ఈ కారణంతోనే వంగవీటి రాధా ఆరోపణలు చేశారా? లేక మరేదైనా కారణముందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెంట్రల్ బలమైనది....
వంగవీటి రాధా పోటీ చేయాలనుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అదే ఆయనకు బలమైన నియోజకవర్గం. అక్కడ టీడీపీ, వైసీపీలో బలమైన నేతలుండటంతో అక్కడ పోటీ చేసే ఛాన్స్ లేదు. తూర్పు నియోజకవర్గానికి వెళ్లి దేవినేని అవినాష్ ను ఢీకొనాలన్న ఆలోచన రాధాకు లేదు. అలాగే దేవినేని అవినాష్ కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా హత్యకు కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో ఏ నేత ఏపార్టీలో ఉన్నా లెక్కలు మాత్రం ఎవరివి వారికున్నాయని చెప్పవచ్చు.


Tags:    

Similar News