ఏందయ్యా.. ఇద్దరూ ఇలా తయారయ్యారు?

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఎన్నికల వాతావరణం తెలంగాణలో నెలకొంది.

Update: 2022-01-05 03:10 GMT

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఎన్నికల వాతావరణం తెలంగాణలో నెలకొంది. గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంది. కేసీఆర్ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టింది. కానీ ఈసారి కేసీఆర్ కు గెలుపు అంత సులువు కాదు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు వచ్చిన నూతన అధ్యక్షులు కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

బలం లేకపోయినా....?
తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయింది. కాంగ్రెస్ అలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న పార్టీ అది. దానిని బలహీన పర్చడమే ధ్యేయంగా కేసీఆర్ వ్యూహాలు రచించుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ బలం పుంజుకుంది. నాలుగు పార్లమెంటు స్థానాలను, మూడు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. కారణాలు ఏవైనా రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఏ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు.
బెంగాల్ తరహలో....
ఇప్పడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తొలి నుంచి దూకూడుగా ఉన్నారు. తాజాగా ఆయన అరెస్ట్ తో బీజేపీకి కొంత హైప్ వచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనాలు బీజేపీ విషయంలో తప్పేలా ఉన్నాయి. బీజేపీ ఒక వైరస్ లాంటిది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా వేగంగా వ్యాప్తి చెందుతుంది. త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో అదే మనం చూశాం. కాంగ్రెస్ ను బలహీనపర్చాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయనిపిస్తుంది.
ప్రస్తుతానికి వీక్ గా కన్పిస్తున్నా....
అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సయితం స్పీడ్ ఉన్న నేత. కేసీఆర్ ఆయన కుటుంబం టార్గెట్ గా రాజకీయంగా ఎదిగిన నేత. కాంగ్రెస్ ప్రస్తుతానికి రేసులో వెనకబడి ఉన్నట్లు కన్పించినా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ బలం పుంజుకునే అవకాశముంది. అయితే ఈ ఇద్దరు యువనేతల స్పీడ్ కేసీఆర్ కు కలసి వచ్చే అవకాశమూ లేకపోలేదు. రెండు బలమైన పార్టీలుగా ఉంటే ఓట్ల చీలిక టీఆర్ఎస్ కు మూడోసారి కూడా లాభిస్తుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. అదే సమయంలో రెండు పార్టీల్లో ఏదో ఒకదానిని ప్రజలు పక్కన పెడితే కేసీఆర్ కు నష్టం జరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు ఇద్దరూ కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.


Tags:    

Similar News