రూ.500లు అడిగితే.. 51 లక్షలు ఎలాగో తెలుసా?
సుభద్ర కష్టాన్ని చూసి చలించిపోయిన టీచర్ రిగిజా హరికుమార్ ఆమె ఇంటికెళ్లి పరిస్థితిని చూసి వెయ్యి రూపాయలు సాయం చేశారు
భర్త లేడు. కుటుంబాన్ని పోషించాలి. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం తన పిల్లల కడుపు నింపడానికి కూడా ఆమె వద్ద పైసా లేదు. దీంతో సిగ్గువిడిచి యాచించింది. అయితే ఆమె అదృష్టం అలా కలసి వచ్చింది. ఆమె అకౌంట్ లోకి 51 లక్షలు చేరిపోయాయి. కేరళలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే....
కుమారుల కడుపు నింపేందుకు...
పాలక్కాడ్ కు చెందిన సుభద్రకు ముగ్గురు కొడుకులు. కటిక పేదరికం. ఆమె భర్త గత ఆగస్టు నెలలో మరణించాడు. అప్పటి నుంచి కష్టాలు చుట్టాలు వచ్చినట్లు వచ్చి తిష్టవేశాయి. ముగ్గురు కొడుకుల కడుపు నింపలేని సుభద్రకు ఏం చేయాలో తోచలేదు. మరో వైపు చిన్న కొడుకు రిబ్రల్ పాల్సి వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఇక ఏం చేయాలో తోచని సుభద్ర చివరకు తన రెండో కొడుకు అభిషేక్ చదువుతున్న పాఠశాలకు వెళ్లి హిందీ టీచర్ రిగిజా హరికుమార్ ను సాయం చేయాలని కోరింది. తనకు ఐదు వందలు ఇస్తే తన కుమారుల కడుపు నింపుతానని ప్రాధేయపడింది.
టీచర్ సాయంతో...
సుభద్ర కష్టాన్ని చూసి చలించిపోయిన టీచర్ రిగిజా హరికుమార్ ఆమె ఇంటికి వెళ్లి పరిస్థితిని పూర్తిగా చూసిన తర్వాత వెయ్యి రూపాయలు సాయం చేశారు. ఆ సాయం సరిపోదనుకున్నాడో ఏమో.. ఆ టీచర్ వెంటనే సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సదరు టీచర్ క్రౌడ్ పుల్లింగ్ ద్వారా నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ టీచర్ సుభద్ర కుటుంబం దీనగాధను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె అకౌంట్ నెంబరు ఇచ్చి నేరుగా ఆదుకోమని కోరారు. అంతే.. దాతలు ముందుకు వచ్చారు. సంస్థలు, వ్యక్తులు చేసిన సాయంతో రెండు రోజుల్లోనే సుభద్ర అకౌంట్ లోకి 51 లక్షలు వచ్చి చేరాయి. ఇంకా మనసున్న మారాజులు ఉన్నారని ఈ ఘటనతో రుజువైందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.