నో... కామెంట్స్... టీడీపీ ఇంటర్నల్ ఆర్డర్

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం ఆలోచనలో పడింది. ఎవరినీ దీనిపై కామెంట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

Update: 2022-06-05 14:05 GMT

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. ఎవరినీ దీనిపై కామెంట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా సీనియర్ నేతలకు, పార్టీ అధికార ప్రతినిధులకు ఈ ఆదేశాలు అందినట్లు తెలిసింది. పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అప్పటి వరకూ ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. తాము గతంలో తగ్గామని, ఈసారి మిగిలిన పక్షాలు తగ్గాలని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి కామెంట్స్ చేయకుండా టీడీపీ నేతలను అధిష్టానం కట్టడి చేసింది.

మహానాడు తర్వాత...
మహానాడు సక్సెస్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఊపు వచ్చింది. కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న ఉత్సాహం తమను విజయం వైపునకు తీసుకువెళుతుందన్న ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కిందిస్థాయిలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. జనసేనకు బలం లేదని, టీడీపీ నాయకత్వాన్ని అంగీకరిస్తేనే మంచిదని, ప్రజలు టీడీపీ వైపు ఉన్నారని టీడీపీ నేతలు అంటుండగా, జనసేన నేతలు మాత్రం ఈసారి తమ ఓటు బ్యాంకు ద్వారానే విజయం లభిస్తుందన్న విషయాన్ని విస్మరించవద్దని అంటున్నారు.
నిన్నమొన్నటి వరకూ....
ఇలా కిందిస్థాయిలో మొన్నటి వరకూ సఖ్యతగా ఉన్న జనసేన, టీడీపీ వర్గాలు ఇప్పుడు సవాళ్లు విసురుకుంటున్నాయి. ఎవరూ తమ ఆధిపత్యాన్ని వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రెండు పార్టీల క్యాడర్ ఒప్పందం కుదుర్చుకుని బరిలోకి దిగాయి. కొన్ని సీట్లను కైవసం చేసుకున్నాయి. అధినాయకులతో సంబంధం లేకుండా కుదుర్చుకున్న పొత్తులు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం మరోమారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. జనసైనికులు మాత్రం ఈసారి పవన్ కల్యాణ్ కు ఛాన్స్ ఇవ్వల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఈ ఫార్ములా....
మరోవైపు 50 : 50 ఫార్మాలను కూడా తెరపైకి తెస్తున్నారు. తొలి రెండున్నరేళ్లు పవన్ కల్యాణ్ సీఎంగా ప్రకటించాలని, తర్వాత టీడీపీ సీఎం పదవిని చేపట్టాలన్న సూచన కూడా తెరపైకి వస్తుంది. మధ్యలో బీజేపీ మాత్రం ఇందుకు అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాలి. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలన్న స్ట్రాటజీని వాడాలని భావిస్తుంది. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఎంత మేరకు అంగీకరిస్తుందన్నది చూడాలి. తెలుగుదేశం పార్టీ మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తొందరపడి ఎవరూ కామెంట్స్ చేయవద్దని ఆదేశాలు అంతర్గతంగా జారీ చేసింది.


Tags:    

Similar News