40 ఇయర్స్ ఇండ్రస్ట్రీ... పొత్తులపై ప్లాన్ అదేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై అంత తొందరపడటం లేదు. అందుకు స్ట్రాటజీని అమలుపరుస్తున్నారు.

Update: 2022-06-01 04:18 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై అంత తొందరపడటం లేదు. పొత్తులు పెట్టుకునే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినా ముందు అవతలి వారు పొత్తు ప్రతిపాదన తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే మహానాడులో అంత భారీ జనసందోహం మధ్య కూడా పొత్తుల విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించలేదు. పొత్తులపై ముందుగా తాము ప్రతిపాదన తెస్తే బలహీనమవుతామని ఆయన భావన కావచ్చు. ఇప్పటికిప్పడు అవసరం ఏంటన్నది కావచ్చు. కానీ చంద్రబాబు అంత పెద్ద సభలో పొత్తులపై ఏ మాత్రం మాట అయినా మాట్లాడకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

పొత్తులు గ్యారంటీ అయినా....
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ రాజకీయాల్లో ఒక స్పష్టత వచ్చింది. తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా ముందుకు వెళ్లలేదు. ఒంటరిగా పోటీ చేసే సాహసానికి మరోసారి ఒడిగట్టదు. అలాగే జనసేన సయితం అదే భావనలో ఉంది. బీజేపీతో పొత్తుతో ఇప్పటికే ఉన్నా దాని వల్ల ప్రయోజనం లేదన్నది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తెలుసు. తెలుగుదేశం పార్టీతో నడిచి వెళితేనే మరోసారి పరువు దక్కుతుంది. అసెంబ్లీలో తాను అడుగు పెట్టేందుకు వీలవుతుంది. అంతే కాదు అధికార పార్టీని గద్దె దించేందుకు వీలవుతుందని జనసేనాని అభిప్రాయం.
ఇప్పటికిప్పుడు...
కానీ చంద్రబాబు పొత్తులపై ఇప్పటికిప్పుడు చర్చలు జరపాలన్న ఆసక్తి లేదు. ఆయన పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మహానాడు సక్సెస్ కావడంతో ఆయన జిల్లాలను పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. బాదుడే బాదుడే కార్యక్రమానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. ఈ హీట్ ను మరో రెండేళ్లు కొనసాగించాల్సి ఉంటుంది. కార్యకర్తలను వచ్చే ఎన్నికల వరకూ కార్యోనుఖుల్ని చేయాల్సిఉంది. కొన్ని నియోజకవర్గాల్లో స్దబ్దుగా ఉన్న నేతలను సయితం ఉరికించాల్సి ఉంది.
జిల్లాల పర్యటనతో...
175 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంగా ఉందన్న సంకేతలను తమతో పొత్తు పెట్టుకోవాలనుకున్న పార్టీలకు తొలుత చంద్రబాబు పంపాలి. ఆ ప్రయత్నంలోనే టీడీపీ అధినేత ఉన్నారు. బలమైన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు? సీఎం పదవి? వంటి కీలక అంశాలు పొత్తుల చర్చల్లో వస్తాయి. అందుకే చంద్రబాబు ఇప్పుడిప్పుడే పొత్తుల ఊసే ఎత్తడానికి ఇష్టపడటం లేదు. నేతలను సయితం ఎవరి పని వారు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అవతలి పక్షం నుంచే....
పొత్తులు పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన 175 నియోజకవర్గాలకు చెందిన నేతలను ఆదేశించారు.175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నుంచి 35 నియోజకవర్గాలకు చంద్రబాబు ఇంతవరకూ పార్టీ ఇన్ ఛార్జిలను నియమించలేదు. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని చంద్రబాబు బస్సు యాత్రతో జిల్లాలను చుట్టి రావాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటన సందర్భంగా భారీ జనసమీకరణ చేయాలని, అందుకు సిద్ధమైన జిల్లాల్లోనే తొలుత చంద్రబాబు పర్యటిస్తారని తెలుస్తోంది. పొత్తుల అంశంలో మాత్రం అవతలి పక్షం నుంచి ప్రతిపాదన రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి మాట్లాడే అవకాశాలు లేవు.


Tags:    

Similar News