గెలిస్తే లాభం లేదప్పా

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు వినపడుతున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందంటున్నాయి

Update: 2023-05-04 03:37 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు వినపడుతున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటేస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం గెలుపు తనదేనన్న ధీమాతో ఉంది. మరోవైపు జనతాదళ్ ఎస్ సయితం హంగ్ ఏర్పడితే తామే ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంటామన్న నమ్మకంతో ఉంది. పాత మైసూరు ప్రాంతం చాలు తమకు చీఫ్ మినిస్టర్ పదవి దక్కడానికి అన్నట్లు జేడీఎస్ వ్యవహారశైలి ఉంది. అక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఆ పార్టీ మిగిలిన ప్రాంతాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు.

అధికారంలోకి వచ్చినా...
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ గెలిచినా ఆనందం ఎక్కువ కాలం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గెలుపు ముఖ్యం కాదని ఐదేళ్లు అధికారంలో ఉండేలా చేేసుకోవడమే ముఖ్యమని నేతల నుంచి క్యాడర్ వరకూ అదే భావనలో ఉన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలత ఉన్నా కొంత అనుమానాలు అయితే లేకపోలేదు. అయితే ఎన్నికలకు ముందు మాత్రం పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గాలు కలిసే తిరుగుతున్నాయి. ఇద్దరూ ఒక్కటై ప్రజల ముందుకు వెళుతుండటంతో కొంత సానుకూలంగా పరిస్థిితి ఉందని చెబుతున్నారు.

సీఎం, మంత్రి పదవుల కోసం...
మరోవైపు ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికే కొంత ఫైట్ ప్రారంభమయింది. ఒకవేళ గెలిచినా వెంటనే మంత్రి పదవులపై కూడా అనేక మంది నేతల్లో ఆశలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తి నిత్యం ఉంటూనే ఉంటుంది. దానిని సొంతం చేసుకోవడం బీజేపీ లాంటి పార్టీకి పెద్ద పనేం కాదు. అసంతృప్తులను తిరిగి తమ గూటికి రప్పించుకోగల సామర్థ్యం కమలం పార్టీకి ఉంది. అవసరమైతే యడ్యూరప్ప రంగంలోకి దిగి అందుకు వేదికను సిద్ధం చేస్తారు కూడా. యడ్యూరప్పకు ఉన్న అపారమైన అనుభవంతో పార్టీలో చీలక తేవడం పెద్ద విషయమేమీ కాదు. అప్ప అంటే అంత భయం ఇప్పటికీ ప్రత్యర్థుల్లో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రజల్లో నుంచి గెలవకలదు కాని, బీజేపీ పోటు నుంచి తప్పించుకుంటుందా? అన్న సందేహమయితే అందరికీ ఉంది.
కమలం వేటు నుంచి...
అందుకే గెలవడం కర్ణాటకలో గొప్ప కాదని, ఆ అధికారాన్ని నిలుపుకోవడమే ముఖ్యమని చెబుతున్నారు. సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇచ్చినా డీకే వర్గం చూస్తూ ఊరుకోదు. డీకేకు హైకమాండ్ ఓకే చెప్పినా సిద్ధరామయ్య సిద్ధంగా ఉండరు. అవసరమైతే తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి వెళ్లినా వెళతాడు. ఇప్పటికే జేడీఎస్ నుంచి వచ్చిన సిద్ధరామయ్యకు మరో పార్టీ జంప్ చేయడం పెద్ద విషయం కాదు. అలాగే ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల నుంచి తప్పించుకోవాలనుకున్నా బీజేపీ ఆఫర్ ను డీకే శివకుమార్ అంగీకరించక తప్పదు. అందుకే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెప్పడం పెద్ద విషయం కాదు.. అధికారం నిలుపుకోవడమే అసలైన సమస్య. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News